ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నారు పెద్దలు… పెండ్లి విషయం పక్కన పెడితే, ఇల్లు కట్టాలంటే మాత్రం పెద్ద సాహసమనే చెప్పాలి. స్థలంతో పాటు సిమెంట్, ఇసుక, ఇటుక, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ. లక్షలు ఖర్చవుతాయి. ఈ కష్టాలకు రాబోయే రోజుల్లో చెక్ పడనున్నది. ప్రస్తుతం నిర్మాణ రంగంలో వస్తున్న వినూత్న మార్పులతో పైన చెప్పిన సామగ్రి వినియోగించకుండా అతి తక్కువ సమయం, ఖర్చుతో రెడీమెడ్ ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి. అవే కంటైనర్ హౌస్‌లు. హైదరాబాద్‌తో పాటు చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తున్నది. అందంగా, సౌకర్యవంతంగా, నాణ్యతగా ఉండడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. రోడ్‌సైడ్ హోటళ్లు, ఫాంహౌస్‌లు, ఆఫీసులు, సెక్యూరిటీ రూంల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఒక హాల్, బెడ్ రూం, కిచెన్, డైనింగ్, డ్రాయింగ్ రూంలు అత్యాధునిక వసతులు ఉంటాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సింగిల్, డబుల్, డూప్లెక్స్ విభాగాల్లో వందలాది మోడళ్లతో నిర్వాహకులు వీటిని తయారు చేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన పదిహేను నుంచి నెలరోజుల్లోపు డెలివరీ చేస్తున్నారు.
పటాన్చెరు, జనవరి 28: ఆధునిక కాలంలో నిర్మాణ రంగంలో వేగంగా వస్తున్న మార్పులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తక్కువ టైంలో కోరుకున్న మోడల్లో రెడిమేడ్‌గా ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు కంటైనర్ హౌజ్‌లు, ఫాంహౌజ్, పోర్టబుల్ క్యాబిన్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మనం నచ్చిన మోడల్‌ను ఇస్తే నెల రోజుల్లో మీకు నిర్మాణం పూర్తి చేసి అందజేస్తున్నారు. ఫ్యాబ్రికేషన్ వర్క్ అంతా కంపెనీల్లో చేసి కంటైనర్ ఇంటిని మీరు కోరుకు న్న ప్రాంతానికి డెలివరి చేస్తున్నారు. ఇప్పుడు తోటల్లో, పొలాల్లో ఫాంహౌజ్‌ల నిర్మాణం జోరందుకుంది. జీఐ షీట్, ఎంఎస్ ఛానల్స్, పైప్స్ వాడి తయారు చేస్తున్న ఈ రెడీమేడ్ ఇండ్లు
సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఆధునిక మోడల్లో లోపల మంచి ఇంటీరియల్, బెడ్ రూంలు, కిచెన్, డైనింగ్ రూం, డ్రాయింగ్ రూంలు, హాల్స్‌తో సహా అందులో ఉంటున్నాయి. ఖర్చు పరంగా చూస్తే సిమెంట్‌తో కట్టిన ఇంటికంటే చవకగా ఉండటంతో ప్రజలు వీటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు రోడ్లపై వెలుస్తున్న టీపాయింట్స్, రెస్టారెంట్స్, ఆఫీసులు, సెక్యూరిటీ రూంలు, ఇతర వ్యాపార సంస్థలు ఈ కంటైనర్ మోడల్స్‌లోనే కనిపిస్తున్నాయి. మల్టీపర్పస్‌గా ఉపయోగపడుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఆఫీసులను కూడా ఇదే కంటైనర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 10నుంచి 20 ఏండ్ల వారంటితో ఈ ఇండ్లు మన్నికగా ఉంటాయని కంపెనీల ప్రతినిధులు తెలుపుతున్నారు. డబుల్ బెడ్రూం, జీ ప్లస్ వన్ మోడల్స్, విల్లాస్లను కూడా తయారుచేసి ఇస్తున్నారు.
అవసరాన్ని బట్టి సౌకర్యాలు
ఫ్రీఫ్యాబ్ ఫ్యాక్టరీలు కంటైనర్ హౌస్, క్యాబిన్స్‌లో సౌకర్యాలను మనం కోరుకున్న విధంగా కల్పిస్తున్నారు. బయట జీఐ, ఎంఎస్ షీట్లు వాడి ఇనుప ఛానల్స్‌తో, యాంగల్స్తో వెల్డింగ్, నట్బోల్ట్తో ఫిటింగ్‌లు చేస్తున్నారు. తలుపులు, అద్దాలు, డిజైనర్ షీట్లు వాడి బయటి రూపం డిజైన్‌కు తగ్గట్టుగా చేస్తారు. కోరుకున్న రంగుల్లో అలంకరిస్తారు. మనం అడిగిన హైట్‌లో లేపి కం టైనర్ హౌజ్‌ను ఫిట్ చేస్తారు. డూప్లెక్స్ మోడల్లోనూ నిర్మించి ఇస్తారు. లోపలి భాగంలో గోడలకు వినీర్, ఉడ్, వినైల్, ైప్లెవుడ్ వాడి అలంకరిస్తున్నారు. కింద ఫ్లోరింగ్ కూడా ఉడ్‌లో, వినీర్ ఫ్లోరింగ్ చేస్తున్నారు. విద్యుత్ షాక్ రాకుండా ప్లాస్టిక్ పైపులు వాడి పాయింట్స్‌ను జాగ్రత్తగా సెట్ చేసి ఇస్తున్నారు. కిచన్లోనూ ఆధునిక మోడల్ స్టవ్‌లు, కప్‌బోర్డ్స్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు. సోఫాలు పెట్టుకునేలా సౌకర్యవంతంగా ఇస్తున్నారు. బెడ్రూం నచ్చిన మోడల్లో అలంకరిస్తున్నారు. కప్ బోర్డ్స్, అల్మారాలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. టాయిలెట్లోనూ ఆధునిక సౌకర్యం కల్పిస్తున్నారు. స్నానం చేసిన, కాలకృత్యాలు తీర్చుకున్న పైపులైన్ ద్వారా నీరు బయటకు వెళ్లేలా చేస్తున్నారు. గీజర్ పెట్టుకుని వేడి నీటిని సైతం వాడుకునేలా మోడల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆఫీసు కార్యాలయాలకు కూడా ఫర్నిచర్, కంప్యూటర్లు, అల్మారాలు, కుర్చీలు పెట్టుకునేలా ఏర్పాట్లు ఉంటున్నాయి. అద్దాల మెరుపులు జత చేస్తున్నారు. విధి నిర్వహణలో తాత్కాలిక ఆఫీసుల అవసరాలుంటే ఇవే ఉత్తమంగా ఉంటున్నాయి. ప్రాజెక్టు వర్క్‌లు నడిచేచోట ఈ కంటైనర్ ఆఫీసులు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఖర్చు కూడా మిగుల్చుతున్నాయి. పైగా ఆ సైట్లో పనైపోతే వెంటనే వేరే సైట్‌కి తేలిగ్గా తరలించే ఏర్పాటు ఉంది. పనులన్నీ పూర్తి చేసుకుని దాంతో అవసరం తీరిందంటే రీసైక్లింగ్, రీ డిజైనింగ్ చేసుకుని మనకు అనుకూలంగా మార్చుకొని వాడుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ రెడీమెడ్ డిజైన్డ్ కంటైనర్ హౌస్‌లకు మంచి ఆదరణ లభించనున్నది.
కోరుకున్న మోడల్ కండ్ల ముందు..
సాధారణంగా ఒక ఫాంహౌస్ కట్టాలంటే చాలా కష్టం. నగరాల్లో నివసిస్తున్నవారు గ్రామాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో తాము కోరుకున్న మోడల్లో ఫాంహౌస్‌ను నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. వారంతంలో వెళ్లి పనులు పురమాయించి నచ్చినట్టు ఫాంహౌస్ నిర్మించుకోవడం అంటే కాలంతో పాటు ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడా చింత లేదు. నచ్చిన మోడల్లో ఫాంహౌస్‌కు ఆర్డర్ ఇస్తే 15నుంచి నెల రోజుల్లో ఆ ఇళ్లు మీ వ్యవసాయ క్షేత్రానికి డెలివరీ అవుతుంది. కాలంతో పాటు ఆధునిక పద్ధతుల్లో నిర్మాణాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యాబ్రికేషన్ రంగంలో జరుగుతున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తక్కువ ధరలో సొంతింటి కల నెలవేరుతున్నది. పూర్తిగా ఇనుము, జీఐ షీట్లు, వెల్డింగ్, నట్‌బోల్టులు వాడి రెడిమెడ్‌గా కంటైనర్ హౌస్ అందజేస్తున్నారు. మనం ఇచ్చిన సైజుల్లో ఫ్యాబ్రికేషన్ చేసి కంటైనర్ల ద్వారా మనం కోరుకున్న ప్రాంతానికి చేరుస్తున్నారు. ఫ్రీఫ్యాబ్
ఫ్యాక్టరీల్లో వందల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నచ్చిన మోడల్లో నివాసం ఉంటూ కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు. సిమెంట్, కాంక్రీట్, ఇటుకలతో కట్టిన నిర్మాణాలకు ప్రత్యమ్నయంగా వచ్చిన ఈ కంటైనర్ హౌస్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. 10 నుంచి 20ఏండ్ల వరకు ఈ కంటైనర్ హౌస్‌లు పక్కాగా వినియోగించుకోవచ్చన్నారు. వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ వర్క్స్, మెయింటనెన్స్, పెయింటింగ్ సరిగ్గా చేసుకుంటే దాని కాలాన్ని పొడిగించుకోవచ్చు కూడా. ఇక ధర కూడా లక్ష నుంచి 6లక్షల వరకు మాత్రమే ఉంటున్నది. ఇంకా సౌకర్యాలు, సైజులు పెంచుకుంటే ధరలు కొద్దిమేర పెరుగుతాయి.
భవిష్యత్ పోర్టబుల్ క్యాబిన్లదే
మాది జహీరాబాద్. ఉపాధి కోసం మా కుటుంబం అంతా హైదరాబాద్‌కు 20ఏండ్ల క్రితం వచ్చాం. నేను, మా కుటుంబం ఏడేళ్లుగా ఈ రంగంలో క్యాబిన్స్, కంటైనర్ హౌస్‌లు తయారు చేస్తున్నాం. భవిష్యత్ డిమాండ్ అంతా పోర్టబుల్ క్యాబిన్లదే. వీటికి మంచి డిమాండ్ ఏర్పడుతు న్నది. తక్కువ ఖర్చులో రెండు రోజులనుంచి నెలరోజుల్లో కోరుకున్న మోడల్లో క్యాబిన్స్ తయారు చేసి ఇస్తున్నాం. మల్టీపర్పస్‌గా ఈ క్యాబిన్లు ఉపయోగించుకోవచ్చు. విల్లాస్, డ్యూప్లెక్స్, ఫాంహౌస్, షాపులు, రెస్టారెంట్, ఆఫీసులుగా వాడుకోవచ్చు. లోపల కూడా కోరుకున్న సౌకర్యాలు అందజేస్తాం. అసెంబ్లింగ్ చేసి ఏ ప్రాంతానికైనా పంపిస్తాం. నచ్చిన మోడల్లో డిజైన్ తయారు చేస్తాం. జీఐలో, ఎంఎస్‌లో బయటి గోడలు ఉంటాయి. ఈ మెటీరియల్‌తో కట్టిన నిర్మాణాలు మెయింటనెన్స్ సరిగ్గా నిర్వహిస్తే మన్నికగా ఉంటాయి. ఆధునిక నిర్మాణాలు కోరుకుంటున్నవారు వీటివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు కొన్న క్యాబిన్‌ను ఎప్పుడనుకుంటే అప్పుడు ఆధునీకరించుకునే సౌకర్యం ఉంది.
– నయీం, యజమాని, ఎంఆర్ పోర్టబుల్ క్యాబిన్స్ కంపెనీ పటాన్చెరు
రెడీమేడ్ క్యాబిన్లు అవసరాలు తీరుస్తున్నాయి
రెడీమేడ్ క్యాబిన్లు అవసరాలు తీరుస్తున్నాయి. పర్మినెంట్ స్ట్రక్చర్ కాకుండా తాత్కాలికంగా నిర్మాణాలు కావాల్సిన వారికి ఈ రెడీమేడ్ క్యాబిన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డుపై ఎక్కడ చూసిన వీటినే ఉపయోగించి రెస్టారెంట్లను నిర్మిస్తున్నారు. మొదట ఈ క్యాబిన్లలో వ్యాపారం బాగా నడుస్తుంటే పర్మినెంట్ స్ట్రక్చర్ కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యాపారం దెబ్బతింటే ఈ కంటైనర్ క్యాబిన్లను అమ్మేసుకుంటున్నారు. పెద్దగా నష్టం ఉండట్లేదు. ఆఫీసులకు, చాయ్ హోటల్స్‌కి, రియల్ ఎస్టేట్ కార్యాలయాలకు, ఫాంహౌస్‌లకు ఈ క్యాబిన్లు ఉపయోగపడుతున్నాయి. ఆధునీకంగా అన్ని సౌకర్యాలతో ఉంటుండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుంటాయి కాబట్టి వీటికి డిమాండ్ పెరుగుతున్నది.
– హనుమంతరావు, ట్యాక్స్ కన్సల్టెంట్, ముత్తంగి