చిన్నకోడూరు, జనవరి 20 : సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మహదేవోజు విష్ణు భార్య నవ్యశ్రీ, కూతురు సుస్మిత, కుమారుడు నందు, మహదేవోజు మహేందర్ భార్య అరుణ, కూతురు మానస, కుమారుడు కార్తీక్ ఆటోలో సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో బంధువుల వద్ద సంవత్సరికానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు.
ఈ క్రమంలో రాజీవ్ రహదారి నుంచి పెట్టుబండల మీదుగా గంగాపూర్‌కు వెళ్లే క్రమం లో సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అతి వేగంతో వచ్చి వీరు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నవ్యశ్రీ, అరుణ అక్కడికక్కడే మృతిచెందారు. మహేందర్, సుస్మితకు తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. మిగతా నలుగురు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను సిద్దిపేట మార్చురీకి తరలించారు. మహదేవోజు విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు తోడికోడళ్లు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి బాధిత కుటుంబీకులను ఓదార్చి పరమార్శించారు.