Indiramma House Scheme | రామాయంపేట రూరల్, మే 3 : రామాయంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా 363 మంది లబ్దిదారులను గుర్తించారు. ఇందులో దామరచెర్వు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 97 మంది లబ్దిదారులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు కేవలం ఆరుగురు మాత్రమే బేస్మెంట్ వరకు నిర్మించారు. మిగత వారు ఇండ్లు నిర్మించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే కట్టిస్తే బాగుండేదని లబ్దిదారులు అభిప్రాయపడుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు దామరచెర్వు మినహా ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాలేకపోవడం గమనార్హం.
పూరి గుడిసెలో బతుకుతున్నాం : గంగారపు పోచవ్వ
ఇల్లు కట్టుకునే స్థోమత లేకనే పూరి గుడిసెల్లో ఎన్నో ఏండ్ల నుంచి ఉంటున్నాం. లబ్దిదారుల లిస్టులో నా పేరు వచ్చింది. కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కట్టిస్తే ఇల్లు కట్టే పరిస్థితి ఉంది. ఇల్లు కట్టడానికి అప్పు అడిగితే చిల్లిగవ్వ పుట్టడం లేదు.
కట్టడానికి సిద్దంగా ఉన్నా మంజూరు అయితలే : పసులక్ష్మి
ఇండ్లు లేని వారికి ఇస్తామని సర్కారు చెప్పగానే దరఖాస్తు చేశాను. ఇప్పుడు ఇండ్లు కడుతున్న వారితో నా పేరు పంపారు కానీ మంజూరు రాలేదు. రెండో విడతలో చూద్దామని చెప్తున్నారు. కొందరికి ఇచ్చి అర్హత ఉన్న మాలాంటి వాళ్లకు ఇవ్వకపోవడం భాదాకరంగా ఉంది.
లబ్దిదారులకు ముందే డబ్బులిస్తే బాగుండేది : సంపత్‌కుమార్
ఇండ్ల ఎంపికలో ఎక్కువ మంది చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇస్తే ఎంతో ఆసరాగా ఉండేది. అప్పులు తెచ్చి కట్టాల్సి వస్తుంది. దీంతో పనుల్లో సమయం వృథా అవుతుంది. సర్కారు కట్టించిన బాగుండు.
నిలువు నీడ లేదు : శంకరయ్య
మొదట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే నా లాంటి వాళ్లకు ఇస్తారని ఎంతో ఆశపడ్డాం. రోజు కూలీ పనులు చేస్తూ పూరి గుడిసెలో ఉంటున్నా. భార్య, పిల్లలు లేరు. సర్కారు గుర్తించి నాలాంటి వాళ్లకు ఇల్లు కట్టిస్తే ఎంతో ఆసరాగా ఉండేది.