Sadasivapeta | సదాశివపేట, మార్చి 21 : సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సదాశివపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పన్ను వసూలుతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు శుక్రవారం సదాశివపేట పట్టణంలోని కొందరు దుకాణాదాలకు ఫోన్ కాల్స్ చేశారు.
నేను మున్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్నాను. మీ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసింది, లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, డబ్బులు కట్టకపోతే ఫైన్ వేస్తాము. నేను పంపించిన ఫోన్ నెంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పేలో డబ్బులు పంపించాలని ఫేక్ నెంబర్ (917989272438) నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. దుకాణాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ చేసుకోవాలి, మిషన్ భగీరథ బిల్లులు చెల్లించాలని పట్టణంలోని పలువురికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము పంపిన నెంబర్లకు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేయాలని సైబర్ నేరగాళ్లు ఆదేశించారు.
ఇదిలా ఉండగా సదాశివపేట మున్సిపల్ కమిషనర్‌గా మహిళా అధికారి ఉండడంతో పలువురికి అనుమానం వచ్చింది. దీంతో మున్సిపల్ కమిషనర్ ఉమాకు తెలియజేయడంతో వెంటనే కమిషనర్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివపేట పట్టణ ప్రజలు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్‌కు రెస్సాన్స్ అవొద్దని పోలీసులు తెలిపారు. అలాగే ఫోన్ పే, గూగుల్ పే లకు ఎలాంటి డబ్బులు పంపవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.