జగదేవ్‌పూర్ (కుకునూర్‌పల్లి), ఏప్రిల్ 6: కరెంట్ కోతలు, భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయక పోవడంతో యాసంగి వరి పొలాలను కాపాడుకోవడానికి రైతన్నలు అపసోపాలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం రాయవరంలో పలువురు రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి తడులు అందిస్తున్నారు. శనివారం అటుగా వెళ్తున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఈ దృశ్యాన్ని చూసి రైతు కనకయ్యతో మాట్లాడారు.
ఎంతో పెట్టుబడి పెట్టి కాయకష్టం చేసి వరి వేస్తే, చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతు కనకయ్య వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తప్పేది లేక అప్పులు తెచ్చి ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి పంటలకు నీరందిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు.
ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో కండ్లముందు చేతికొచ్చిన పంటలు ఎండుతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మసాగర్, మల్లన్న సాగర్ కింద నీళ్లు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుస్థితి లేదన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.