న్యాల్కల్, జనవరి 5 : పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మామిడితో అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సరైన యాజమాన్య పద్ధ్దతులు రైతులు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పూతకు మందు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో పూత ఆలస్యంగా వచ్చి రైతులకు నష్టం జరుగుతున్నది. కొమ్మలు కత్తిరించడం, దున్నడం చేయకుండా మామిడి తోటలకు విశ్రాంతి ఇవ్వాలి. అలా చేస్తే పూత త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది రైతులు పూతకు ముందు కొమ్మలు కత్తిరింపు, దున్నడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడంతో పూత ఆలస్యంగా వస్తున్నది. ముఖ్యంగా పూత, పిందె, కాయలు కాసే సమయంలో తెగుళ్లు, చీడపీడల విషయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు.
ఈ పనులు చేయకూడదు
నీటి సౌలభ్యం ఉన్న రైతులు రెండు నెలల ముందు నుంచే నీటి తడులు ఇస్తారు. ఇలాంటివి అస్సలు చేయకూడదు. కనీసం రెండు నెలల ముందే నీటి తడులు నిలిపివేయాలి. ఇక పూత సమయంలో అకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు ఆశిస్తాయి. వీటిని నివారించేందుకు ఉద్యానవన అధికారుల సూచించిన మందులతో పిచికారీ చేయాలి. పూతదశ దాటిన తర్వాత పిందె రాలకుండా సరైన చర్యలు తీసుకోవాలి. దీన్ని నివారించడానికి సరైన మందులు పిచికారీ చేయాలి. అలాచేస్తే పిందె రాలకుండా ఉండి మంచి దిగుబడి సాధించవచ్చు. రెండేండ్లుగా కరోనా ప్రభావంతో రైతులకు ఆశించిన ఆదాయం రాలేదు. కానీ, మంచి రేటు ఉంటుందని రైతులు ఆశపడుతున్నారు.
సాగుకు అనువైన మామిడి రకాలు ఇవే…
జిల్లాలో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసం, పెద్దరసం, చెరుకు రసం రకాల సాగు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కేసరి, సువర్ణరేఖ, దశేరి వంటివి బాగుంటాయి. సంకర రకాల విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా అమ్రపాలి, రత్న, ఆర్కా, పునీత్, సింధు వంటి రకాలు బాగుంటాయని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు.
నీరు, ఎరువుల వాడకం…
మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. పూత దశ, పిందెలు కాసే దశ మామిడికి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. చెట్ల పొదుల్లో ఎండుగడ్డి, ఎండిన ఆకులు, కొబ్బరిబోండాలు లాంటివి వేసి కప్పి ఉంచాలి. దీంతో కలుపు మొక్కల నివారణ సులభంగా చేయవచ్చు. అంతే కాకుండా మొక్కలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలకు ఎరువులు అందించాలి. తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో వర్షాకాలం ప్రారంభంలో, తర్వాత వర్షాకాలం చివరిలో ఎరువు వేయాలి. వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం ముగిసే సమయంలో ఎరువులు వేసుకోవాలి. తోటల్లో ప్రధానంగా జింక్ లోపం వచ్చే అవకాశాలు ఎక్కుగా ఉంటాయి. దీని నివారణకు లీటరు నీటిలో 5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం ఉంటే ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. దీన్ని నివారణకు 2.5 గ్రాముల పెర్రస్ సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
కలుపు నివారణ కోసం..
మామిడి తోటల్లో కలుపు సమస్యను నివారించేందుకు పారాసల్ఫేట్ 8 మీ.లీ లేదా అమోనియం సల్ఫేట్ 20 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మామిడి మొక్కలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కొమ్మల ఆకులతో సరైన సూర్యరక్ష్మి చెట్లకు అందక పండ్లని తయారు చేసుకునే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. సీఏచర్, లాఫర్ వంటి పరికరాలను ఉపయోగించాలి.
చెదపురుగు..
చెదలు ఎర్రనేలలు, ఇనుప నేలలో కూడిన మెట్టభూముల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి వేళ్లు, బెరుడు ఆశించడంతో చిన్న మొక్కలు చనిపోతాయి. పెద్ద కొమ్మలు బలహీనపడుతాయి. నీటి ఎద్దడి ఉన్నప్పుడు సైతం వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. కొత్తగా మొక్కలు నాటే సమయంలో గుంతకు మట్టిలో అరకిలో వేపపిండి లేదా 100 గ్రా. పాలిడాల పొడిని కలిపాలి. చెదపుట్ల ఉన్న స్థలాన్ని గుర్తించి రాణి పురుగుతో సహా నాశనం చేయాలి. చెదలు ఆశించిన కాండంపై మట్టిపొరను తొలిగించి క్లోరోఫైరిపాస్ పిచికారీ చేయాలి.
తేనె మంచు పురుగు..
తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలు..
లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీ లీటర్ల లేదా కార్సరిల్ 3 గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లతో కలిపి చెట్టులో పూత, పిందె వచ్చే సమయం పూత, ఆకులపై కాకుండా మొదల్లో పిచికారీ చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోక మందు పిచికారీ చేయాలి. పూతబాగా ఉన్నప్పుడు పిచికారీ చేస్తే పుప్పొడి రాలిపోయి పరాగ సంపర్కానికి తోడ్పటే కీటకాలు మరణిస్తాయి. ఇక మొగ్గ దశలో కనిపించిన సమయంలో 3 గ్రాముల ఎడల కార్బరిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మీల్లిలీటర్, ఒక గ్రా.కార్చడిజమ్ను లీటర్ నీటిలో కలిపి వెంటనే పిచికారీ చేయాలి. ఆక్లారా 0.1 మిల్లీ లీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పూత కాత సమయంలో తేనె మంచు పురుగును సమర్థవంతగా నివారించవచ్చు.
బూడిద తెగుళ్లు..
వీటిని నీటిలో కరిగే రెండు గ్రాముల గంధకం లేదా ఒక మిల్లీలీటర్ కెరాథెన్ లేదా ఒక గ్రా. మైకోబ్యూటనిల్ లేదా ఒక గ్రా. బేరిటాస్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి పదిహేను రోజుల తర్వాత మార్చి పిచికారీ చేయాలి.
మచ్చ తెగుళ్లు..
ఎండిపోయిన కొమ్మలను వెంటనే తీసివేయాలి. వాటిని లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్
కలిపి పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కాయపుచ్చు పురుగు..
గులాబీ రంగు చారతో తెల్లటి లద్దె పురుగు కాయ అడుగున రంధ్రం చేసి తోలును కుండలు తిని సొరంగాన్ని ఏర్పరుస్తుంది. కాయ లోపలి భాగం పూర్తిగా తినేస్తుంది.ఒక కాయలో నుంచి 8 పురుగులు ఉంటాయి. దీన్ని నివారణకు వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగు కోశస్థ దశ, ఎండు పుల్లలు,బెరుడు గడుపుతుంది. ఎండిపోయిన మామిడి బెరడును చెట్టు నుంచి తొలిగించాలి. అత్యవసర స్థితిలో సైపర్ మెథ్రీన్ 2 ఇసి.0.5 మి.లీ. లీటర్ నీటిలో కలిపి పూత, పిందెపై పిచికారీ చేయాలి.
పిండినల్లి పురుగు..
ఇది కాయ లేత కొమ్మల నుంచి రసాన్ని పీల్చి చెట్టుకు బలహీన పరుస్తుంది. ఇవి విసర్జించిన తేనె వంటి జిగురై మసి తెగుళ్లు వృద్ధి చెంది పండు నాణ్యత తగ్గిస్తుంది. ఈ తేనె వంటి పదార్థం కోసం చీమలు వస్తాయి. డిసెంబర్, జనవరిలో చెట్టుకు కాండం, మొదలు చుట్టు పాలిథీన్ పేపర్ అడుగు వెడల్పులో కట్టాలి. లేదా జిగురు పూసి పిల్లిపురుగు పైకి పాకుండా ఆపవచ్చు. చెట్టు చుట్టూ వేసవిలో పాదు చేయాలి. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా మిథైల్ ఏడెమటాన్ 2 మి.లీ. లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదలు కొమ్మలతో సహా పిచికారీ చేయాలి.
టెంకుపురుగు..
తోతాపురి, నీలం రకాల మామిడి తోటల్లో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం, బెరడు తొలిచే పురుగు పాడైపోయిన కొమ్మలను తొలిగించడంతో దీన్ని నివారించవచ్చు. బెరడులో పురుగులు ఉన్నట్లయితే ఇనుప చువ్వల ద్వారా వాటికి బయటకు తీసి చంపేయాలి. ఆ రంధ్రాల్లోకి లీటర్ నీటికి 10 మి.లీ డైక్లోరోఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ కలిపి రంధ్రంలో పోసి బంకమట్టితో మూసిపోయాలి.
పూత, పిందె దశలో జాగ్రత్తలు తీసుకోవాలి
మామిడి పంటలో పూతదశనే కీలకం. పూత సమయంలో తేనెమంచు, తామర పురుగు, ఆకు చుట్టు, పూత చుట్టు, పండి నల్లి పురుగులు నష్టాన్ని కలిగిస్తాయి. ఆకుజల్లెడ పురుగు(బల్లి పాతర) చెట్లపై లేకుండా చూసుకుంటే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. చీడపీడలు, తెగుళ్లపై అవగాహన పెంచుకుని వాటిని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. మామిడి పూతలో ప్రతి పూల గుత్తిలో 4-6 వేల వరకు పూలుంటాయి. ఇందులో 1-3పూలే కాయలుగా వృద్ధి చెందుతాయి. మామిడి తోటల్లో పూత, మొగ్గ ఏర్పడిన తరువాత పైపాటుగా ఎరువులు వేసుకోవాలి. చెట్టు వయసు బట్టి సాధారణంగా 500 గ్రాముల నుంచి కిలో యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేపపండితో కలిపి వేసిన తర్వాత 15 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు అనేక కారణాలతో మూడు దశలో పిందెలు, కాయలు రాలుతుంటాయి. పిందెలు రాలకుండా ఉండేందుకు చెట్లకు 20-30 రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు నీటి తడులివ్వాలి. సాగునీటి సౌకర్యం లేనివారు యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పిందే రాలుడు ఉధృతి ఎక్కువగా ఉంటే 4.5 లీటర్ల నీటిలో 1 మి.లీ ఫ్లానోపిక్స్ కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. ఎలాంటి సమస్యలు ఉన్నా మామిడి రైతులు మమ్మల్ని సంప్రదించాలి. మామిడి తోటలకు సందర్శించి సలహాలు, సూచనలిస్తాం.
– అనూషరెడ్డి, క్లస్టర్ ఉద్యాన అధికారి, జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)