వర్గల్, ఫిబ్రవరి 4: కాళేశ్వర గోదారమ్మ పరవళ్లతో వర్గల్ మండలంలోని చౌదర్పల్లి బంధం చెరువు, వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువులు అలుగు పారుతున్నాయి. రెండు పర్యాయాలుగా యాసంగిలో పరుగులెత్తిన గోదావరి నది జలాలు ఈ ఏడు యాసంగిలో ముచ్చటగా మూడోసారి చెరువులను నింపుతూ హల్దీవాగు మార్గంలో సింగూర్ ప్రాజెక్టుకు చేరనున్నాయి. వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను పలకరిస్తూ 13.5 కి.మీ దూరం ప్రయాణించి నాచగిరి క్షేత్రం వద్ద లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం దాటి మెదక్ జిల్లాకు పయనమవుతున్నాయి. చౌదర్పల్లి బంధం చెరువు 88 ఎకరాల ఆయకట్టు, వర్గల్ పెద్ద చెరువు 132 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బోరు ఆధారిత వ్యవసాయ రైతులకు కాళేశ్వర జలాలు మేలు చేయనున్నాయి.
జీవాలకు గ్రాసం.. పొలాలకు సాగునీళ్లు
వరుసగా మూడోసారి కాళేశ్వరం నీళ్లతో నిండిన చెరువులు పశు పోషకుల్లో సంతోషం నింపుతున్నాయి. గొడ్డూగోద, గొర్రె, మేకలున్న పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే తమ పశువులకు మేత కష్టమయ్యేదని, చెరువులను నింపడం ద్వారా వరిగడ్డి, సొప్పగడ్డి, అదనంగా యాడాది పొడవునా పశుగ్రాసానికి, తాగునీటికి ఢోకా లేకుండాపోయిందంటున్నారు.
నేడు హల్దీవాగులోకి…
చౌదర్పల్లి బంధం చెరువు, వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువులను అలుగులు పారిస్తూ కాళేశ్వర గోదావరి జలాలు నేడు అంబర్‌పేట ఖాన్‌చెరువు ద్వారా హల్దీవాగులోకి వెళ్లనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. అంబర్‌పేట ఖాన్ చెరువు నుంచి 8.5 కి.మీ దూరం ప్రయాణించి నాచగిరిక్షేత్రం దాటి మెదక్‌లోకి అడుగుపెట్టనున్నాయి. హల్దీవాగు పరీవాహక ప్రాంత రైతులు, పశు పోషకులకు బతుకుదెరువు చూపినట్లయింది.
బోర్లు నిండుగా పోస్తున్నాయి
మా వూరు కెనాల్‌కు దగ్గరలోనే మాకు ఎకర పొలం ఉంది. గోదావరి నీళ్లతో వర్గల్ పెద్ద చెరువు నింపడంతో మా ఊరు పొలాల దాకా నీళ్లు కమ్ముకుంటాయి. దీంతో బోర్లలో ఫుల్ నీళ్లుంటాయి. మోటర్ ఎప్పుడేసినా గ్యాప్ లేకుండా పోస్తది. ఇంతకుముందు బోర్లు ఇట్లా పొయ్యకుండే. పంటలకు ఢోకా లేకుండా అయింది.
– ఏనుగుల దశరథ్, రైతు, శేరిపల్లి