చేర్యాల, ఫిబ్రవరి 2: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. మూడో ఆదివారం స్వామివారి నామస్మరణలతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఆదివారం సందర్భంగా 30వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగరేగుచెట్టు వద్ద ముడుపులు, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించడంతో పాటు గుట్టపై ఉన్న ఎల్లమ్మకు ఒడిబియ్యం పోసి బోనం సమర్పించుకున్నారు.
ఈ సందర్బంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈవో రామాంజనేయులు, ఏఈవో బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి,ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుడి మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం భక్తులను ఇతరమార్గాల నుంచి తీసుకువస్తున్నారనే అం శంపై ఆలయ అధికారులు, కొమురవెల్లి పోలీసులకు వాగ్వాదం జరిగింది. ప్రతి ఆదివారం ఆలయ క్యూ నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి పోలీసులు ప్రొటోకాల్ పేరిట పలువురిని తీసుకువస్తుండడంతో సిబ్బంది కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాము దర్శనాలకు రాలేదని, ప్రొటోకాల్ మేరకు డ్యూటీ చేస్తున్నామని సదరు అధికారి కొమురవెల్లి ఎస్సై రాజు మధ్య వాగ్వాదం జరిగింది.