చేర్యాల, మార్చి 26: కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో దేవాదుల కాల్వలు చెత్తాచెదారం, ముళ్లపొదలతో మూసుకుపోయాయి. అసలే దుర్భిక్ష ప్రాం తం.. దీనికితోడు నీటి ఇబ్బందులతో యాసంగిలో వేసిన వరి పంటలు ఎండిపోతుండడంతో రైతులు బోర్లమీద బోర్లు తవ్విస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి,ఐనాపూర్ గ్రామాల మధ్య రిజర్వాయర్ నిర్మించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పదేండ్ల పాటు దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నింపి అక్కడ నుంచి కాల్వల ద్వారా చేర్యాల ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావుల నుంచి పుష్కలంగా నీరు వచ్చి పంటలు దిగుబడి పెరిగింది. కాంగ్రెస్ వచ్చాక దేవాదుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో తపాస్పల్లి రిజర్వాయర్ అడుగంటి పోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గిపోయి రైతుల బోర్లనుంచి చుక్కనీరు రాకపోవడంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో సుమారు 1500 ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. రిజర్వాయర్లు నింపి రైతుల పంటలు కాపాడాలని అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ, తపాస్పల్లికి చుక్క నీరు రానివ్వడం లేదు.
ఎండిన చెరువు
చేర్యాల మండలంలోని ముస్త్యాలలోని జక్కల, తాళ్ల చెరువు ఏటా గోదావరి జలాలతో నింపడంతో గ్రామంలో కరువు కనిపించకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చాక ఈ చెరువుకు చుక్క నీరు రాలేదు. దీంతో గ్రామంలోని బోర్లు వట్టిపోయాయి. ఒక్కో రైతు రెండు మూడు బోర్లు వేయించినా ఫలితం లేకుండా పోయింది. ముస్తాల్య గ్రామానికి చెందిన తరిగొప్పుల అంజయ్య అనే రైతు కుటుంబానికి నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పదేండ్లలో బోరు నుంచి పుష్కలంగా నీళ్లు వచ్చి పంటలు మంచిగా పండాయి.
పదేండ్ల నుంచి మంచిగా నీరుపోసిన బోరు ఈసారి ఎండిపోవడంతో పంటలు కాపాడుకునేందుకు మరోరెండు బోర్లు అప్పు చేసి రైతు అంజయ్య తవ్వించాడు. అందులో ఒక్క బోరు నుంచి దుబ్బ తప్ప ఏమి లేదు. మరోబోరు నుంచి కొద్దిపాటిగా నీళ్లు వస్తుండడంతో దానిని వేలాది రూపాయలు ఖర్చు చేసి బోరుమోటర్ ఫిటింగ్ చేశారు. నాలుగున్నర ఎకరాల్లో ఏకరంన్నర పంట ఎండిపోగా మిగిలిన మూడు ఎకరాలను కాపాడుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్నాడు. ప్రతి పంటకు 300 బస్తాలుకు పైగా వడ్లను విక్రయించుకునే రైతు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.