అందోల్, ఏప్రిల్ 5: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో వందలాది రైతు కుటుంబాలు సింగూరు వరద కాల్వను నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నాయి. ఈ గ్రామంలో ఈ యాసంగిలో 600 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. మరికొద్ది రోజుల్లో పంట కోతకొస్తుంది. కానీ, సరిగ్గా ఇదే సమయంలో సింగూర్ ఎడమకాల్వకు మరమ్మతుల పేరిట నీటిని వదలమని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో రైతుల నెత్తిపై పిడుగుపడ్డటైంది. పోనీ చెరువు నీటితోనో..? బోర్ల ద్వారా అయినా పంటలకు పారకం పెట్టి కాపాడుకుందామంటే భూగర్భ జలాలు అండుగంటి బోర్లు పోయడం లేదు.
చెరువులు ఎండిపోవడంతో రైతులు ఎంచేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పంటలు ఎండుతుండడంతో నీళ్లు వదలండి సార్ అంటూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పంటలు వేయవద్దని మీకు ముందే చెప్పామని, అయినావేశారని.. ఇక మీచావు మీరు చావండి…కాల్వకు మరమ్మతులు అయ్యేదాకా నీళ్లు వదిలేది లేదంటూ అధికారులు కసురుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కాల్వల మరమ్మతుల గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని, కనీసం మీటింగ్లు నిర్వహించి చెప్పలేదని రైతులు పేర్కొంటున్నారు.
అధికారులు నిజంగా తమకు సమాచారం ఇస్తే ఎందుకు పంటలు సాగు చేస్తామని, ఎందుకు ఎండబెట్టుకుంటామని రైతులు ప్రశ్నిస్తారు. మరో వారం పదిరోజుల్లో పంటలు కోతకు వస్తాయని, ఒక్క తడి నీళ్లు అందించినా బయట పడుతామని, ప్రభుత్వ స్పందించి సంబంధిత అధికారులకు నీళ్లు వదిలేలా ఆదేశాలివ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.927 టీఎంసీల నీళ్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, ఈ ఒక్కసారి నీళ్లు వదలాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే సగం పంటలు ఎండి పశువులకు మేతగా మారాయని, రెండు, మూడు రోజుల్లో తడి అందక పోతే పూర్తి పంటలు ఎండుతాయని, అదే జరిగితే తమకు చావే దిక్కంటున్నారు రైతులు.
చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతూ పశువులకు మేతగా మారుతుంటే ఎంతో బాధగా ఉంది. నాకున్న 2 ఎకరాల భూమిలో గతంలో లెక్కనే వరి సాగుచేసిన. పంట వేసిన తర్వాత అధికారులు మీరు పంట ఎందుకు వేసిండ్రు, కాల్వల ద్వారా నీళ్లు రావని చెప్పినం కదా..? అంటూ చెబుతున్నారు. అన్నట్లుగానే కాల్వల ద్వారా నీటిని ఆపేసిండ్రు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. అధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఎన్నడూ ఇంత బాధపడ్డది లేదు. మా ఒక్క కొండారెడ్డి పల్లిలోలోనే వందలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా అధికారులు మాత్రం వదలడం లేదు.
– బానోత్ శంకర్ నాయక్, రైతు, కొండారెడ్డిపల్లి