సంగారెడ్డి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మళ్లీ కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు గోసపడుతున్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీళ్లు అడుగంటాయి. దీంతో నారాయణఖేడ్ నియోజకవర్గం అంతటా పంటలు ఎండిపోతున్నాయి. కండ్ల ఎదుట వరి, జొన్న పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. ఎండిన వరి పొలాలను ఏమి చేయాలో దిక్కుతోచక రైతులు పశువులను, మేకలను మేపుతున్నారు.
నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉండడంతో కల్హేర్ మండలంలోని చివరి ఆయకట్టు రైతులు సాగునీటిపై ఆశతో వరి, జొన్న, ఇతర పంటలు సాగు చేశారు. నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లున్నా నీటిపారుదల శాఖ సాగునీరు విడుదల చేయడం లేదు. దీంతో సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లో 800 ఎకరాలకుపైగా వరి, జొన్న పంటలు నీళ్లందక ఎండిపోతున్నాయి. నల్లవాగు కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేస్తే వరి, జొన్న పంటలు చేతికివచ్చే అవకాశం ఉందని, విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. పంటలు ఎండిపోయి రూ.లక్షల్లో నష్టపోయామని, ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో చెరవులు, బోరుబావుల కింద వరి, జొన్న ఇతర పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చెరువులు ఎండిపోవటంతో రైతులు ఎక్కువగా యాసంగిలో ఆరుతడి పంటలు వేశారు. బోరుబావుల కింద రైతులు వరి, నీటిజొన్న పంటలు సాగు చేశారు. రెండు నెలలుగా నారాయణఖేడ్ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.
దీంతో బోరుబావులు నీళ్లు పోయడం లేదు. దీనికితోడు అనధికారిక కరెంటు కోతలు రైతులకు ఆశనిపాతంలా మారుతున్నాయి. బోర్లు నీళ్లుపోయక పోవడం, కరెంట్ కోతల కారణంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి, నాగల్గిద్ద, సిర్గాపూర్, కల్హేర్, నిజాంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో బోరుబావులు ఎండిపోవడం, బోర్లు గ్యాప్ ఇచ్చి నీళ్లు పోయడంతో వరి, జొన్న పంటలు ఎండిపోతున్నాయి. దీంతో కొంతమంది రైతులు ఎకరానికి రూ.6 నుంచి రూ.8వేలు తీసుకొని వలసవచ్చిన గొర్రెలకాపరులకు పచ్చటి పొలాలు మేతకు అప్పగిస్తున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు పూర్తినీటి సామర్థ్యం 1493 ఫీట్లు, ప్రస్తుతం ప్రాజెక్టులో 1480 ఫీట్ల మేర జలాలు ఉన్నాయి. ఏటా యాసంగి సీజన్లో 6వేల ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందజేస్తారు. చివరి ఆయకట్టు కల్హేర్ మండలంలోని గ్రామాలకు సైతం సాగునీరు అందజేస్తారు. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో సాగునీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నీటిపారుదల శాఖ సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని 4090 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉండడంతో రైతులు కాల్వలు, బోరుబావుల కింద రైతులు 5వేల ఎకరాల వరకు వరి, జొన్న పంటలు వేశారు.
కల్హేర్ మండలంలోని చివరి ఆయకట్టు ఉన్న గ్రామాల రైతులు కాల్వల కింద వరి, జొన్న పంటలు సాగు చేశారు. ఇప్పుడు నల్లవాగు ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం లేదు. దీనికితోడు సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని చాలా గ్రామాల్లో బోరుబావులు నీళ్లులేక ఎండిపోయాయి. దీంతో వరి, జొన్న పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు దిగువన ఉన్న మార్డి, కిష్టాపూర్, ఖానాపూర్, ఇందిరానగర్, కల్హేర్ గ్రామాల్లో సాగునీరు అందక వందలాది ఎకరాల్లో వరి, జొన్న పంటలు ఎండిపోతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ పంటలు ఎండిపోతున్నా సాగునీరు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులు, మేకలను మేపుతున్నారు.
నాకున్న ఐదెకరాల్లో బోరుబావుల కింద వరి, జొన్న పంటలు వేశా. నల్లవాగు నుంచి సాగునీరు ఇస్తారన్న ఆశతో కాల్వల కింద జొన్న పంట సాగు చేశా. నాకున్న రెండుబోర్లు ఇప్పుడు వట్టిపోయాయి. బోర్ల నుంచి నీళ్లు రాక వరి, జొన్న పంటలు ఎండిపోతున్నాయి. నల్లవాగు కాల్వ కింద రెండు ఎకరాల్లో సాగుచేసిన జొన్న పంట నీళ్లులేక పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– మల్దొడ్డి చేతక్, రైతు, మార్డి (సంగారెడ్డి జిల్లా)
నేను నాలుగెకరాల్లో యాసంగి సీజన్లో బోరుబావి కింద వరి పంట వేశా. బోరుబావి నుంచి నీళ్లు తక్కువగా వచ్చినా.. నల్లవాగు కాల్వ నుంచి నీళ్లు వస్తాయని ఆశతో వరి పంట సాగు చేశా. ఇప్పుడు బోరుబావి పూర్తిగా ఎండిపోయింది. మా పొలం పైన ఉన్న పెద్ద చెరువు నుంచి నీళ్లు రావడం లేదు. నల్లవాగులో నీళ్లు ఉన్నా అధికారులు కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వడం లేదు. సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పంటలు ఎండిపోతుంటే చోద్యం చూస్తుంది. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు మా పరిస్థితిని గమనించి నల్లవాగు కాల్వల నుంచి నీరిచ్చి పంటలను కాపాడాలి.
– విఠల్, రైతు, కిష్టాపూర్ (సంగారెడ్డి జిల్లా)
బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి పంట వేశా. కరెంటు కోతలు, బోరు పోయకపోవడంతో రెండు ఎకరాల పంట ఎండిపోతున్నది. మొదట బాగానే నీళ్లుపోసిన బోరుబాయి ఇప్పుడు భూగర్భజలాలు అడుగంటడంతో ఎండిపోయింది. నల్లవాగు నుంచి నీళ్లు రావడం లేదు. దీంతో కండ్ల్ల ఎదుట పంట ఎండిపోతున్నా… ఏమి చేయలేకపోతున్నాం. పంట ఎండిపోవడంతో రూ.లక్షకుపైగా నష్టం వచ్చింది.
– శంకర్, రైతు, కిష్టాపూర్(సంగారెడ్డి జిల్లా)
రెండు బావుల కింద నాలుగు ఎకరాల్లో వరి పంట వేశా. ఇప్పుడు నీళ్లులేక రెండు బోర్లు ఎండిపోయాయి. వరి పంట చేతికి వచ్చే దశలో బోర్లు ఎండిపోవడంతో నీళ్లు పెట్టలేని పరిస్థితి ఉంది. సాగునీరు లేకపోవటంతో కండ్ల ఎదుట చేతికి వచ్చిన పంట ఎండిపోతుండడంతో తట్టుకోలేకపోతున్న. సాగునీరు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పశువులను వరి పొలాల్లో మేపుతున్న…
– నర్సింహులు, రైతు, నిజాంపేట (సంగారెడ్డి జిల్లా)