సిద్దిపేట, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిలా ్ల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా 31,063 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. భారీ వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు నిండిపోయాయి. ఇప్పడిప్పుడే రైతులు వాటిని తొలిగించుకుంటున్నారు. పంట చేన్లు పూర్తిగా అక్కరకు రాకుండా పోయాయని రైతులు బోరున విలపిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి పది రోజులు గడుస్తున్నా ఇంకా పంటల సర్వే పేరిట అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు రిపోర్టు తయారు చేయలేదు.
కేవలం ప్రాథమిక రిపోర్టు మాత్రమే చేశాం.. అది ఉన్నతాధికారులకు నాలుగు రోజుల్లో తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తాం అంటూ అధికారులు చెబుతున్నారు. ఇది ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా అధికారులు చెబుతున్న మాట. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. రైతులకు న్యాయం చేయాలని ఏ కోశాన కూడా ప్రభుత్వం లేనట్లు కనిపిస్తుంది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తరా..? లేదా..? కాలయాపన చేస్తరా? అనే సందేహాలు రైతుల్లో కలుగుతున్నాయి. ఇప్పటికే రైతుబంధు, పంట రుణమాఫీ ఎగ్గొట్టిన ప్రభుత్వం తాజాగా వర్షాలు, వరదలకు పంట పరిహారం ఇస్తదన్న గ్యారంటీ లేదని రైతులు వాపోతున్నారు.ఇప్పటికే యూరియా దొరకక పంటలు ఎర్రబారి, పెట్టిన పెట్టుబడులు నష్టపోయారు. రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు, వరదలకు 31,063 ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 7,759 ఎకరాలు, మెదక్ జిల్లాలో 18,604 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 4,700 ఎకరాలు ఉండగా పత్తి, వరి,మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో 3,209 మంది రైతులకు సంబంధించి 7,759 ఎకరాల్లో వరి 6,844, పత్తి 6844, మొక్కజొన్న 107 ఎకరాలు, 129 ఉద్యానవన పంటలతో పాటు ఇతర పంటలకు నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో పంటలకు భారీగా నష్టం జరిగింది. దాదాపు 18,604 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఇసుక మేటలతో నిండిపోయాయి. వరి, పత్తి పంటలు పనికిరాకుండా పోయా యి.
16,320 ఎకరాల్లో వరి, 2.284 ఎకరా ల్లో పత్తి, 400 ఎకరాల్లో ఇతర పంటలతో పాటు ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ప్రాథమికంగా అధికారులు తయారు చేసిన రిపోర్టు ప్రకారం జిల్లాలో 4,700 మంది రైతులకు సంబంధించిన 12,691 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగింది. దీంలో పత్తి పంట 6,354 ఎకరాలు, వరి 779 ఎకరాలు, సోయా 1846 ఎకరాలు, కంది 254 ఎకరాలు, మొక్కజొన్న 100 ఎకరాలు, పెసర 1,902 ఎకరాలు, మినుము 1,264 ఎకరాలు, చెరుకు 45 ఎకరాలు, జొన్న 4 ఎకరాలు, ఉద్యానవన పం టలు 81 ఎకరాల్లో నష్టం జరిగినట్లు సమాచారం. పలు గ్రామాల్లో వరదలతో వచ్చిన ఒడ్రు మట్టి తెప్పలు తెప్పలుగా అలానే ఉండి పోవడంతో క్రమంగా వాటిని తొలిగించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
పంటలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాల్లో పేరుకుపోయిన మట్టిని తొలిగించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని రైతులు బోరున విలపిస్తున్నారు.సాగు ఇబ్బం ది కర పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈవరదలు మరింత నష్టాన్ని మిగిల్చాయి. యూరియా దొరకక, పెట్టుబడి సాయం అందక అప్పులు తీసుకువచ్చి సాగు చేసిన రైతులకు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం స్పందించి పరిహా రం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నాకున్న రెండు ఎకరాల్లో ఇసుక మేటలు, నీళ్లు నిలిచి వరి పంటంతా మురిగి పోయింది. మా కుటుంబం రోడ్డున పడ్డది. ఆరుగాలం కష్టపడే మాకు ఈ పరిస్థితి రావడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం నష్టపరి హారం చెల్లించాలి లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం. మా వరి పంటలో ఇంకా నీళ్లు నిలిచే ఉన్నాయి.
నాకున్న ఎకరంలో వరిసాగుచేశా. వరిపంట మొత్తం నీటిలో మునిగిపోయి నష్టం జరిగింది. పంటంతా ఇసుక మేటలతో నిండిఉంది. ఇసుక మేటలు తీద్దామన్నా చేతికి రాకుండా ఉంది. ఏంచేయాలో తోచడం లేదు. వర్షం మా చావుకే వచ్చింది. అసలే మేము కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు దానికి తోడు పంటంతా నేలపాలైంది. మా బతుకుకు దిక్కు ఎవరూ లేరు. నష్టాలకు గురైన మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– కుందెన మురళి, రైతు, రామాయంపేట, మెదక్ జిల్లా