 
                                                            ఎటూచూసినా ఏడుపులే… అయ్యో… దేవుడా ఏం పాపం చేశామయ్యా… మేము ఇప్పుడు ఎట్ల బతకాలే.. అంటూ రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ గొల్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైపోయిందని చూసి గుండెలు అవిసేలా రైతులు రోదించిన తీరుతో మార్కెట్ యార్డు ప్రతిధ్వనించింది. కుప్పలు.. కుప్పలుగా పోసిన ధాన్యం రాశులు.. కొనుగోళ్లతో హడావిడిగా ఉండాల్సిన మార్కెట్ రైతుల కన్నీటి రోదనలతో హోరెత్తింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు దాదాపు వందమందికి పైగా రైతుల తెచ్చిన ధాన్యం మొంథా తుపాన్ మింగేసింది. తుపాన్ ఎఫెక్ట్‌తో పాటు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేని మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యానికి రైతుల ధాన్యం వరద పాలైపోయింది.
హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 30: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు కొద్దిరోజులుగా ధాన్యం రాశులతో కళకళలాడుతున్నది. పండించిన పంటను విక్రయించేందుకు కొందరు, ఆరబోసేందుకు మరికొందరు దాదాపు రెండువందల మందికి పైగా రైతులు తమ ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెచ్చారు. ఇందులో పదిహేను రోజులు, పదిరోజులు, వారం రోజుల కిందట తెచ్చిన ధాన్యం సైతం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 మ్యాశ్చర్ రాకపోవడంతో పలువురు రైతుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో షెడ్లు, ప్లాట్‌ఫామ్‌లపై రైతులు ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. హుస్నాబాద్ చాలా ఏండ్ల తర్వాత బుధవారం 32 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
బుధవారం ఉదయం నుంచి రాత్రివరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డు మునిగిపోయింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలోకి సైతం భారీగా వరద రావడంతో అక్కడ పోసిన ధాన్యం సైతం కాల్వల్లో కండ్లముందే కొట్టుకుపోతున్నా రైతులు కాపాడుకోలేకపోయారు. ఒక్కరిద్దరు కాదు అనేకమంది రైతుల ధాన్యం వరద పాలై రైతులకు దు:ఖం మిగిలింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు డిజైన్ సరిగాలేక ఏటా రైతుల ధాన్యం తడిసిపోవడం, వాననీటికి కొట్టుకుపోవడం జరుగుతున్నది. బాధిత రైతులను పరామర్శించి మరో ఏడాది ఇలా జరగకుండా చేస్తామనడం ప్రజాప్రతినిధులు, అధికారులకు పరిపాటిగా మారింది. పోతారం (ఎస్) గ్రామంలోని వడ్లోని ఏనె నుంచి వచ్చే వరదతో హుస్నాబాద్ మార్కెట్ యార్డు మునుగుతున్నది. ఈ వరదను మార్కెట్లోకి రాకుండా ప్రత్యేకంగా కాల్వ నిర్మించి, ఆ వరదను నాగారం రోడ్వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఏటా రైతులకు నష్టం జరుగుతున్నది.

01
హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు మూడుట్రిప్పుల వడ్లు తెచ్చి ఆరురోజుల కిందట పోసిన. ఎండిన వడ్లే తెచ్చిపోసినం. నిన్నవానకు వడ్లన్నీ తడిసిపోయినయి. పచ్చివడ్లు తీసుకోమని బతిమాలినా సార్లు పట్టించుకుంట లేరు. ఎండబెడితే తీసుకుంటమని ఆర్డీవో సారు చెబుతున్నడు. నీల్లల్ల ఎడ ఆరబోత్తం సెప్పండిసారు. ఈడ అన్నీ నీల్లే ఉన్నయి. ఎన్నడు ఆరాలే.. ఎన్నడు కొనాలే.. మిల్లోళ్లకు చెప్పుమన్నా పట్టించుకుంటలేరు. -శ్రీనివాస్, రైతు, తోటపల్లి (సిద్దిపేట జిల్లా)
ఎండబోసుకోండ్రి అంటున్నరు మా వడ్లు తడిసినయి అని కలెక్టర్ మేడమ్‌కు సెబితే ఎండబోసుకుండ్రి అంటున్నరు. కొంటం కొనం అని కూడా అంటలేదు. ఎంతచెప్పినా మా బాధ వినలేదు. ఇరవై రోజుల కిందట హుస్నాబాద్ మార్కెట్‌కు మూడు ట్రాక్టర్ల వడ్లు తెచ్చినం. మ్యాచర్ 18 వచ్చిందని కొనలే. ఇప్పుడు వానకు అన్నీ తడిసిపోయినయి. ఒక్కరోజు ఆగుమని చెబితే ఇప్పుడు వడ్లన్నీ తడిసి ఆశలేకుంట అయ్యింది. మమ్మల్ని పట్టించుకునే వారు లేరు.
– మారుపాక సంపత్, రైతు, హుస్నాబాద్ టౌన్ (సిద్దిపేట జిల్లా)
చిన్నకోడూర్, అక్టోబర్ 30 : వానకాలం ఏసిన వరిపంట మొత్తం నష్టపోయా. అకాల వానకు రెండు ట్రాక్టర్ల వడ్డు వాగులో కొట్టుకుపోయినయి. గింత వాన నేనెప్పుడూ చూడలేదు. కాలమంతా కింద మీద అయితాంది. నోటి కాడికి వచ్చిన బువ్వ వాన దేవుని పాలైంది. కొనుగోలు కేంద్రంలో ఎండబెట్టరాదని ఇక్కడే ఎండబెట్టిన పాపానికి వడ్లన్నీ చేతుకు రాకుండా పోయాయి. నాతో పాటు మా ఊరి రైతుల వడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– కర్రొల్ల గోనయ్య, రైతు, ఇబ్రహీం నగర్ (సిద్దిపేట జిల్లా)
 
                            