అందోల్, డిసెంబర్ 19: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రా జెక్టు ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యాసంగిలో పంటలు సాగుచేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అందుకోసం ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేయాలని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీనికి బలాన్ని చేకూర్చేలా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి వెళ్లారు. అధికారులు ప్రాజెక్టు మరమ్మతులపై ఏమి చెప్పక పోవడంతో ఈసారైనా పంటలు సాగుచేయాలా..వద్దా..? అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటి వరప్రదాయిని సింగూరు ప్రాజెక్టు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు కింద పుల్కల్, చౌటకూర్, అందోల్ మండలంలో ఆయకట్టు ఉంది. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 29.05 టీఎంసీలు కాగా, ప్రస్త్తుతం 16.5 టీఎసీంల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందుతుండగా, 40వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. కాల్వల మరమ్మతుల పేరుతో గత వానకాలం సీజన్లో ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు సాగుచేసిన రైతులు నష్టపోయారు. కాల్వలకు మరమ్మతులు చేసే విషయం ముందస్తుగా సమాచారం లేకపోవడంతో అప్పట్లో రైతులు పంటలను కాపాడేందుకు ట్యాంకర్లతో నీటిని తెచ్చినా ఫలితం లేక పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. సింగూరు నుంచి ఎలాగూ నీటిని వదులుతారనే ఉద్దేశంతో పుల్కల్, చౌటకూర్, అందోల్ మండలాల్లో రైతులు పంటల సాగుకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కానీ, అధికారులు మాత్రం నీటిని వదులుతారా..? లేదా అనే విషయంపై ఎటూ తేల్చడం తేదు. ఇప్పటికే పలుమార్లు సింగూరు ప్రాజెక్టును సందర్శించిన అధికారులు, డ్యామ్ సేప్టీపై ఎటూ తేల్చకపోవడంతో నీటిని ఉంచుతారా…?ఖాళీ చేస్తారా అనే విషయం తేలడం లేదు. స్థానిక అధికారులు సైతం దీనిపై రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వ్యవసాయంపైనే ఆధారపడిన పుల్కల్, చౌటకూర్, అందోల్ మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం సీజన్ ఎలాగు నష్టపోయాం, ఈ యాసంగి సీజన్‌కైనా అధికారులు నీటిని వదులుతారా..? లేదా అనేది తేలడం లేదు. తీరా పంటలు వేశాక, గత సీజన్‌లాగే నీళ్లు అందక పంటలు తమ కండ్ల ముందే ఎండుతుంటే చూసి తట్టుకోవడం తమతో కాదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతుల విషయంపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని ఖాళీచేసే విషయంలో మాకు పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎలాంటి సమాచారం లేదు. రైతులు మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించాల్సిందే. కాల్వల మరమ్మతులు యథావిధిగా కొనసాగుతాయి. ప్రాజెక్టును పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పై నుంచి వచ్చే సూచనలు, ఆదేశాల ప్రకారం మేడు నడుచుకుంటాం. పంటలకు మాత్రం నీళ్లు ఇవ్వడం కుదరదు. రైతులు దీనిని గుర్తించి పంటల సాగుపై ఆలోచించాలి. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం డ్యామ్ మరమ్మతులు చేపడతాం.
– భీం, సింగూరు ప్రాజెక్ట్ ఈఈ
సింగూరు ప్రాజెక్టు కాల్వల ద్వారా పంటలు సాగుచేసుకుంటూ బతుకుతున్నా. ఏడాదిగా పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నాం. వానకాలం సీజన్లో సైతం పంటలు వేశాక కాల్వలకు రిపేర్లు అంటూ అధికారులు నీటిని విడుదల చేయలేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా పంటలను నీళ్లందించి కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నీటిని వదులుతారో లేదో తెలువడం లేదు.
– లక్ష్మణ్‌గౌడ్, రైతు,సాయిబాన్‌పేట్ (సంగారెడ్డి జిల్లా)
సింగూరు కాల్వల కింద పంటలు సాగుచేసే రైతులకు సంబంధిత అధికారులు నీటి విడుదల విషయంపై స్పష్టత ఇవ్వాలి. ప్రాజెక్టు నుంని నీటిని ఎప్పుడు వదులుతారో, కాల్వలకు ఎప్పుడు మరమ్మతులు చేస్తారో, పంటలు సాగుచేయాలా వద్దా అధికారులు ఊరూరా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వాలి. పంటలు వేసుకున్నాక నీళ్లివ్వక పోతే రైతులం నష్టపోతాం. ఇప్పటికే యాసంగికి తుకాలు పోసుకుని సిద్ధంగా ఉన్నాం.
– జగన్, రైతు, సాయిబాన్‌పేట్ (సంగారెడ్డి జిల్లా)