చేర్యాల, మార్చి 14: చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 2023-24 యాసంగిలో చేర్యాలలో 21,960 ఎకరాల 11గుంటలు, ధూళిమిట్టలో 10,472 ఎకరాల 26 గుంటలు, కొమురవెల్లిలో 11,212 ఎకరాల 12 గుంటలు, మద్దూరులో 10,044 ఎకరాల 6 గుంటల్లో వరి సాగు చేశారు. 2024-25 యాసంగి సీజన్లో చేర్యాలలో 11,881 ఎకరాల 37 గుంటలు, ధూళిమిట్టలో 7,446 ఎకరాల 29 గుంటలు, కొమురవెల్లిలో 3,737 ఎకరాల 7గుంటలు, మద్దూరులో 4,603 ఎకరాల 15 గుంటల్లో రైతులు వరిసాగు చేశారు. గత యాసంగిలో 43,654 ఎకరాల్లో వరిపంట సాగు చేస్తే, ఈసారి 27,667 ఎకరాల్లో సాగు చేశారు.
రెండు యాసంగి సీజన్లలో పోలిస్తే సాగు విస్తీర్ణం 15,987 పడిపోయింది. చేర్యాల ప్రాంతంలో ఇప్పటివరకు గ్రామాల వారీగా రైతుల నుంచి సేకరించిన వివరాల మేరకు దాదాపు చేర్యాల్లో మండలంలోని 18 గ్రామాల్లో 400 ఎకరాలు, కొమురవెల్లి మండలంలోని 11 గ్రామాల్లో 150 ఎకరాలు, మద్దూరు 10 గ్రామాల్లో 200, ధూళిమిట్ట మండలంలోని 11 గ్రామాల్లో 250 ఎకరాల్లో వరి పంట ఇప్పటి వరకు ఎండిపోయినట్లు ఆయా గ్రామాల రైతులు తెలిపారు. తపాస్‌పల్లికి గోదావరి జలాలు ఇచ్చి కాల్వల నుంచి చెరువులకు నీటిని పంపింగ్ చేస్తే మిగిలిన పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. ఇదే పరిస్ధితి కొనసాగితే మున్ముందు వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది.
తపాస్పల్లిని పట్టించుకోలేదు…
కరువు ప్రాంతంగా పేరున్న చేర్యాల ప్రాంతాన్ని అన్నివిధాలుగా ఆదుకునేందుకు నాటి పాలకులు చొక్కరావు ఎత్తిపోతల పథకంలో భాగంగా చేర్యాల ఉమ్మడి మండలంలో తపాస్‌పల్లి, ఐనాపూర్ గ్రామాల మధ్య 0.3టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించారు. దేవాదుల నుంచి ధర్మసాగర్, గండిరామారం, బొమ్మకూరు రిజర్వాయర్ల నుంచి నేరుగా తపాస్‌పల్లికి రెండు పైపుల్లో నీటిని ప్రతి ఏడాది పంపింగ్ చేసేవారు. 68వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు నిర్మించిన తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి రెండు దశల్లో చెరువులు నింపడంతో బోరుబావుల్లో నీటి మట్టం పెరిగి విస్తారంగా పంటలు పండాయి.
ఈ ఏడాది దేవాదుల నుంచి తపాస్‌పల్లికి నీళ్లు రావడమే పెద్ద సమస్యగా మారింది. దేవాదుల పథకంలో టెయిల్ ఎండ్‌లో ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ మేరకు కొన్ని రోజులపాటు నామమాత్రంగా నీటిని పంపింగ్ చేశారు. తర్వాత పైపులు పగిలిపోయాయి, మోటర్లు సతాయిస్తున్నాయనే సాకులతో పంపింగ్ చేయడం నిలిపేశారు. దీంతో రిజర్వాయర్‌లో నీరు డెడ్ స్టోరేజీకి వెళ్లిపోవడంతో భూగర్భజలాలు తగ్గి పంటల ఎండిపోతున్నాయి.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన చేర్యాల ప్రాంతం కాంగ్రెస్ పాలనలో విలవిలలాడుతోంది… కరువు ప్రాంతమైన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పంటలు ఎండిపోకుండా సర్కారు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతకు శాపంగా మారింది. నెల రోజులుగా చేర్యాల ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు ఆయా గ్రామాల రైతులు తెలిపారు. పదేండ్లుగా ఎండిపోని పంటలు కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కరువుతో రైతులు లబోదిబోమంటున్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పంపింగ్ చేయకపోవడంతో చేర్యాల ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే వేలాది బోర్లు ఎండిపోవడంతో చేర్యాల ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు నెలలు ఎండాకాలం ఉండడంతో తాగునీటికి సైతం ప్రజలు తిప్పలు పడే పరిస్థితి నెలకొంది. పదేండ్లుగా పచ్చని పంటలతో కళకళలాడిన చేర్యాల ప్రాంతం ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలను రక్షించుకునేందుకు రైతులు నిత్యం పదుల సంఖ్యలో బోర్లు వేసుకుంటున్నారు. 600 ఫీట్ల నుంచి 800 వరకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదని బోరుబండి యజమానులు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితి తాము ఎన్నడూ చూడలేదని బోరుబండి నిర్వాహకులు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అధికారులు మోట ర్లు ఆన్ చేసి దేవాదుల నీటిని తపాస్‌పల్లికి పం పింగ్ ప్రారంభించాలి. గ్రామాల వారీగా యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.20వేలు అందించాలి. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించకపోవడంతో పాటు తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలను పంపింగ్ చేయకపోవడంతో చేర్యాల ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగుంటి పంటలు ఎండిపోయాయి.
ఇప్పటికైనా సర్కారు స్పందిస్తే వేల ఎకరాల్లో పంటలను కాపాడుకోవచ్చు. పలుమార్లు తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని అధికారులతో మాట్లాడడమే కాకుండా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశా. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే వేలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వానికి ముందస్తు ఆలోచన లేకపోవడం, తపాస్‌పల్లికి గోదావరి జలాలు తరలించకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రైతులకు పంట నష్టపరిహారం అందించే విషయంలో అసెంబ్లీలో ప్రస్తావించి, అన్నదాతలకు పరిహారం వచ్చే వరకు పోరాటం చేస్తా.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే