కంపెనీలు ఎరువుల ధరలు ఒక్కసారిగా పెంచడంతో సిద్దిపేట జిల్లాలో వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులపై ఆర్థిక భారం పడింది. ఎరువులను బట్టి బస్తాపై రూ.75 నుంచి రూ.350 వరకు ధరలు పెరిగాయి. యుద్ధం ప్రభావంతో ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు ఇతర ధరలు ప్రభావంతో ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
గజ్వేల్, మే 10: సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో 3.85లక్షల ఎకరాల్లో వరి, 1.18లక్షల ఎకరాల్లో పత్తి, 40వేల ఎకరాల్లో మొక్కజొన్న, కందులు, 8వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. కూరగాయల పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. రైతులు సాగు చేసే పంటలకు ఈఏడు జిల్లాలో వానకాలంలో సుమారు 90వేల టన్నుల ఎరువులు వినియోగిస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందులో యూరియా 45వేల టన్నులు, పొటాష్ 5వేల టన్నులు, కాంప్లెక్స్ 15వేల టన్నులు రైతులు వినియోగిస్తారు. పెరిగిన ధరలతో రైతులపై జిల్లాలో సుమారు కోట్లాది రూపాయల భారం పడనున్నది.
ప్రస్తుతం పెరిగిన ధరలతో రైతులపై అధిక భారం పడుతుంది. జిల్లాలో వానకాలంలో 5.85లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. గత వానకాలంలో రైతులు సాగు చేసిన పత్తి పంటపై అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టం జరిగింది. వరుసగా కురిసిన వర్షాలతో పత్తి పంటలో దిగుబడి రాక, గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగిలో రైతులు జిల్లాలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. సకాలంలో పంటలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుండటంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు యాసంగిలో కూడా తీవ్రంగా నష్టపోయారు. పండించిన పంటలు అమ్ముకునే సమయంలో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధరలు పెరగడంతో మరింత భారంగా మారుతుంది.
ప్రభుత్వం యూరియా, డీఏపీ ధరలు పెంపును అనుమతించకపోవడంతో పాత ధరలే ఉన్నాయి. ఈ రెండింటి అమ్మకాలతో డీలర్లకు లింకు ఎరువులను కొనుగోలు చేసేలా చేస్తుంది. ప్రస్తుతం 50కిలోల బస్తా యూరియా రూ.266, డీఏపీ రూ.1350 అలాగే ఉన్నాయి. 50కిలోల ఆయా రకాల ఎరువుల ధరలు పెరిగాయి.
