రాయపోల్, మార్చి 23 : భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరురాక వరి,మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. రాయపోల్ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగుచేశారు.బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తపల్లి, లింగారెడ్డిపల్లి, రాయపోల్, తిమ్మక్కపల్లి, అనాజీపూర్, పెద్ద ఆరెపల్లి తదితర గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయి.బోర్లు వేసినా నీరు రాకపోవడంతో రైతులకు పాలుపోవడం లేదు. కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో రిజర్వాయర్ నుంచి సాగునీరందని పరిస్థితి ఉంది. కాల్వలు పూర్తిచేసి గొలుసు కట్టు చెరువులు నింపితే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదని రైతులు పేర్కొంటున్నారు