చిలిపిచెడ్, మార్చి 10 : యాసంగి ఆరంభంలో భూగర్భ జలాలు సంతృప్తికరంగా ఉండడంతో రైతులు వరి నాట్లు వేయడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు చిలిపిచెడ్ మండలం మీదుగా మంజీరా నది వెళ్తున్న ఈ ప్రాంత రైతులకు బోర్లు ద్వారా భూగర్భ జలాలు తగ్గకుండా ఉంటాయని అనుకున్నారు. కానీ ఈ ఎండాకాలంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ బోర్లలో నీళ్లు బందయ్యాయి.
నీళ్లు లేకపోవడంతో మండలంలోని పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తమ పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి నాట్లు వేస్తే.. చేతికి రావాల్సిన పంట ఇలా ఎండుతుండటంతో రైతు కుటుంబాలు దిగులు పడుతున్నాయి. ఇప్పటికే వరి పొలాలు దాదాపుగా ఎండిపోవడంతో వాటిలో పశువులను మేపుతున్నారు. కొందరు గొర్రెలను మేపుకోవడానికి కాపర్లకు అమ్మేసుకుంటున్నారు.
చిలిపిచెడ్లో కర్రోళ్ల లక్ష్మణ్ అనే రైతుకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదు బోర్లు వేశాడు. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో ఒక్క బోరు కూడా నీరు పోయడం లేదు. దీంతో మొత్తం ఆరెకరాల పంట పూర్తిగా ఎండిపోతుందని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాడు.