సిద్దిపేట, సెప్టెంబర్ 9( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజంతా వర్షంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంట చేళ్లు నీట మునిగిపోతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లాలో భారీగా పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో 4,172 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 5,078 ఎకరాలు, మెదక్ జిల్లాలో 500 ఎకరాలకుపైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం.
ఉమ్మడి జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి సుమారుగా 9,750 ఎకరాలకుపైగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇంకనూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తిస్థాయి అంచనా వివరాలు వస్తే గానీ ఎంత నష్టం జరిగింది అని తెలియరాదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విరామం లేకుండా వస్తున్న వర్షాల వల్ల పంట పొలాలపై ప్రభావం పడుతుంది.
వాగులు, వంకలు, చెరువులు అలుగులు పారుతున్నా యి. ఫలితంగా వీటి కింద ఉన్న లోతట్టు ప్రాంతా ల్లో ఉన్న పంట చేలల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతోపాటు చాల చోట్ల పొలాల్లో నీరు అలాగే ఉండి పోయింది. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. నీట మునిగిన చేను మురిగిపోతుంది. ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, వరి, పెసర. సోయాబీన్, మినుము లు తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూరగాయలు వర్షాలకు కుళ్లిపోతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాత ఇండ్లు కూలిపోయాయి. బలమైన ఈదురుగాలులతో పెద్ద పెద్ద చెట్లు విరిగి పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వాగులు., చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాటే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్య లు చేపడుతున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాలు పంటలకు జీవం అందిస్తాయనుకుంటే అపార నష్టం తీసుకొచ్చాయి. వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. రాత్రనక, పగలనక రేయింబళ్లు కష్టపడి పంటలను సాగు చేసిన అన్నదాత భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాడు. భారీ వర్షాలతో సాగుచేసిన పంటలు నేల రాలిపోతున్నాయి. వర్షం నీళ్లు పంట చేలల్లో నిలవడం తో పంట కుళ్లిపోతుంది.
చేతికి వస్తాయనుకున్న పంట చేనులు నీటిపాలు కావడంతో రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు దినంగా వేడుకుంటున్నారు. పంటలు సాగు చేసే సమయంలో అప్పులు చేసి పంట పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను నమ్ముకొని వ్యవసాయం చేశారు. తీరా భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, ఇప్పడు పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేవని బోరున విలపిస్తున్నారు.