సిద్దిపేట, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తాము అధికారంలోకి రాగానే రైతులకు వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఓట్లు డబ్బాలో పడగానే ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు కొత్త పల్లవిని అందుకుంది. బోనస్ కేవలం సన్న రకాల వడ్లకు మాత్రమే ఇస్తామని చెబుతున్నది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 80శాతం దొడ్డు రకాలను మాత్రమే రైతులు సాగుచేస్తున్నారు. కేవలం 20శాతం సన్నాలను ఇంటి అవసరాలకు మాత్రమే సాగుచేస్తున్నారు.
రైతులకు బోనస్ ఎగనామం పెట్టడానికి ఇలాంటి కొర్రీలు పెడుతున్నదని కాంగ్రెస్ సర్కారుపై విమర్శిలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విధానం లేకపోవడంతో వానకాలం సాగుపై రైతులు సందిగ్ధం లో ఉన్నారు. ఒకవైపు సన్నాలకు మాతమే రూ. 500 బోన స్ ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, దొడ్డు రకాల వడ్ల సాగుపై స్పష్టతను ఇవ్వలేదు. దీంతో ఏమి సాగుచేయాలో తెలియక రైతుల తికమక అవుతున్నారు. వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ 80శాతం రైతులు దొడ్డు రకం సాగుకే మొగ్గు చూపుతారు. మృగశిర కార్తె ప్రారంభమై రైతు లు నార్లు పోసుకుంటారు. కానీ, ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.
సిద్దిపేట జిల్లాలో గత వానకాలంలో 3,32, 006 ఎకరాలు, యాసంగిలో 3,48,009 ఎకరాలు వరి సాగుచేశారు. మెదక్ జిల్లాలో గత వానకాలంలో 3,00,967,గత యాసంగిలో 1,85,295 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో గత వానకాలంలో 1,04,000ఎకరాలు, యాసంగిలో 1,03,000ఎకరా ల్లో రైతులు వరి సాగుచేశారు. దీంట్లో 80శాతం దొడ్డు రకాలే వడ్లే సాగుచేశారు. కేవలం 20శాతం మేర మాత్ర మే సన్నాలు సాగు చేశా రు. వానకాలం కన్నా యాసంగిలో మరి తక్కువగా సన్నాలు సాగుచేస్తారు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతోపాటు నీటిఎద్దడి ఉంటుంది.
దీంతో గింజ పగిలిపోతుంది. నూకలు ఎక్కువగా వస్తా యి. ఫలితంగా వానకాలం కన్నా యాసంగిలో సన్నరకాల వడ్లు తక్కువగా సాగుచేస్తారు. రైతులు ప్రతి సాగులో సన్న రకాల కన్నా దొడ్డు రకాల వడ్ల సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే పంట దిగుబడిలో సన్నాల కంటే దొడ్డురకం వరి దిగుబడి ఎక్కువగా వస్తుంది. సన్నరకాలకు చీడపీడల బెడదతోపాటు నీటి వసతి ఎక్కువ కావాలి. పంటకాలం కూడా నెల ఎక్కువగానే ఉంటుం ది. దొడ్డు రకానికి సన్న రకానికి ఎంత లేదన్నా నెలరోజుల తేడా వస్తుంది. వర్షాలు అధికంగా పడితే సన్న రకాల వడ్లు తడిసితే బియ్యం ముక్కి పోతుంది.
ఇవన్నీ తట్టుకొని సన్నాలను పండించాల్సి వస్తుంది. దొడ్డు రకాలకు అంత ఇబ్బంది ఏమి ఉం డదు. పైగా పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. పంట కాలం కూడా తక్కువగానే ఉంటుందని రైతులు తెలుపుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దొడ్డు, సన్నం అనే తేడాలు లేకుండా అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాం డ్ చేస్తున్నారు. సన్నాలకు మార్కెట్లో డి మాండ్ ఉన్న పంట అని చెప్పవచ్చు. క్వింటాల్‌కు డిమాండ్‌ను బట్టి రూ.2500 నుంచి రూ.3 వేల వరకు పలుకుతుంది. అదే దొడ్డు వడ్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.2,203, కామన్ గ్రేడ్ వడ్లకు రూ.2,183 చెల్లిస్తున్నారు.
సన్న రకం వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దిగుబడి తక్కువగా వస్తుంది. పైగా నీటి వసతి ఎక్కువ, పంట కాలం సైతం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాల ప్రకారం ఎకరాకు తెలంగాణ సోనా 20 నుంచి 23 క్వింటాళ్లు, బీపీటీ 20 క్వింటాళ్ల వరకు, జై శ్రీరాం 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దొడ్డు రకం వరి దిగుబడితో సన్నరకం వడ్లను పోల్చితే దిగుబడిలో 5 నుంచి 8 క్వింటాళ్ల వ్యత్యాసం ఉంటుంది. దొడ్డు రకం వడ్ల దిగుబడి ఎక్కువ వస్తుంది.
ఎకరాకు ఎంత లేదన్నా సరాసరిగా 25 నుంచి 28 క్వింటాళ్ల వరకు దొడ్డు రకం వరి దిగుబడి వస్తుంది. ఫలితంగా రైతులు దొడ్డు రకం సాగును ఎంచుకుంటున్నారు. సన్నరకం వడ్లను సాగు చేయడంతో పంటకాలం ఎక్కువ అవుతుంది. దిగుబడి తక్కువ వస్తుంది. ఫలితంగా ఎకరాకు ఎంత లేదన్నా రైతు సుమారుగా రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోతాడు. ప్రకృతి విపత్తులను సన్నాలు ఎక్కువగా తట్టుకోవు. అందుకే ఎక్కువ మంది రైతులు సన్నాల సాగు ఆసక్తి చూపరు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అన్ని వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ఎన్నికల ముందు ఎట్లయితే రైతులు పండించిన వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పిర్రో చెప్పినట్లుగానే ఇయ్యాలే. గిప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం మాట తప్పడమే. కాంగ్రెసోళ్లు మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే కాంగ్రెస్‌ను రైతులు ఎప్పుడూ నమ్మరు. ఏ గవర్నమెంట్ ఉన్నా రైతులను మంచిగ చూసుకుంటనే అందరికీ బాగుంటది.
-బండారి యాదగిరి, రైతు, గురువన్నపేట (సిద్దిపేట జిల్లా)
సన్నరకం వడ్లు పండిస్తే దిగుబడి తక్కువ వస్తది. తెగుళ్లు ఎక్కువ ఆశిస్తయి. పెట్టుబడులు బాగా అయితయి. దొడ్డు రకం వడ్ల పండిస్తే దిగుబాడి బాగా రావడంతోపాటు తెగుళ్లను తట్టుకుంటుంది. రైతులు పండించిన అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలే. సన్నరకం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని సర్కారు అనడం సరికాదు. రైతులను ఆదుకోవాలి.
-మల్లం నర్సింహులు, రైతు, ఐనాపూర్(సిద్దిపేట జిల్లా)
దొడ్డు రకం వరి 5 నెలల ప్రారంభంలోనే పంట చేతికొస్తుంది. రొడ్డు రకం వరికి అగ్గితెగులు వంటి ఏరోగం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది.దిగుబడి కూడా అధికంగా వస్తుంది. సన్నరకం వరి పంట చేతికి రావాలంటే పూర్తిగా ఆరు నెలల టైం కచ్చితంగా పడుతుంది.నీటి తడులు ఎక్కువ అందియ్యాలి. ఖర్చు ఎక్కువే. ఏదన్నా రోగం వచ్చిందా పంట మొత్తం నాశనమవుతుంది. దిగుబడి రాక రైతులు మరింతా అప్పులు పాలైతరు. సన్నవడ్లకు మాత్రమే రూ.500 ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆలోచన చెయ్యాలి.వాళ్లు ఇచ్చే రూ.500 లకు ఒక్క పాస్పేట్ సంచి కూడారాదు.
– ఎల్లయ్య, రైతు, నిజాంపేట(మెదక్ జిల్లా)
వరి వేసిన ప్రతి రైతుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లు అయిన తెల్లారి నుంచే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పుతున్నారు. మాట మార్సుడు గీ కాంగ్రెసోళ్లకు మంచిది కాదు. ఎవుసం చేసుడు అంటే మాటలు కాదు. పెట్టుబడులు బాగా పెరిగినయి. కాలం అనుకూలించక పోతే పంటలు దెబ్బతిని రైతులు అప్పుల పాలవుతారు.
-బక్కోల్ల లస్మయ్య, రైతు, రజాక్‌పల్లి, నిజాంపేట మండలం (మెదక్ జిల్లా)