సిద్దిపేట అర్బన్, జూన్ 23: తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేసి, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట పట్టణంలోని సిద్దిపేట అర్బన్ తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించి.. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల పేరుతో కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు పూర్తిగా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలుఇచ్చిందన్నారు. ఉన్న పింఛన్ కూడా సరైన సమయంలో రావడం లేదన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి 18 నెలలు గడిచినా ఇంతవరకు ఆఊసే ఎత్తడం లేదన్నారు. యువతకు రాజీవ్ యువ వికాసం పేరుతో ఆర్భాటం చేసి.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.