చేర్యాల, నవంబర్ 18: అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, చేర్యాల టౌన్ 12 వార్డులు, 53 గ్రామాల్లో సుమారు 2లక్షల జనాభా ఉందని, రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తుందని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి డివిజన్ ఏర్పాటు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్ నాయకులతో జేఏసీ ఏర్పాటు చేసి కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు .వెంటనే అధికార పార్టీ నేతలు రెవెన్యూ డివిజన్ కోసం జీవో తీసుకురావాలని, లేని పక్షంలో ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి చేర్యాల డివిజన్ కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్‌మావో, బద్ధిపడిగె కృష్ణారెడ్డి, అత్తిని శారద, దాసరి ప్రశాంత్, చేర్యాల, కొమురవెల్లి మండల కార్యదర్శులు బండకింది అరుణ్‌కుమార్, తాడూరి రవీందర్, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.