జిన్నారం, ఆగస్టు 24: న్యాయ రంగంలో వివాదాల పరిష్కారానికి లోక్‌అదాలత్, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం, సర్దుబాటు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయని, న్యాయరంగంలో అనేక ఆధునిక మార్పులు వస్తున్నాయని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో జూనియర్ సివిల్ జడ్జి-జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆదివారం హైకోర్టు జడ్జి అనిల్‌కుమార్ జూకంటి, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్పంకజ్, జిల్లా జడ్జి భవానీచంద్రతో కలిసి ఆమె ప్రారంభించారు. జడ్జిలకు కలెక్టర్, ఎస్పీలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం జిన్నారం, బొల్లారం, గుమ్మడిదల, హత్నూర్ పీఎస్‌ల పరిధిలోని పలు కేసులను నూతనంగా ప్రారంభించిన కోర్టు భవనంలో లాయర్లు వాదించారు. ఈ సందర్భంగా హైకో ర్టు జడ్జి సూరేపల్లి నంద మాట్లాడుతూ న్యాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను లాయర్లు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు, మభ్యపెట్టే కేసులు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం జిల్లా జడ్జి భవానీచంద్ర మాట్లాడుతూ 2200 కేసులను జిన్నారం కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అవసరమైన భవనం, వసతులు, ఇతర లాజిస్టిక్ సహాయం కావాల్సిన ఉంటే జహీరాబాద్, జిన్నారంలోని కోర్టులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించటంలో కోర్టు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,పోలీసులు సిబ్బంది. లాయర్లు పాల్గొన్నారు.