సంగారెడ్డి జూన్ 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు విత్తుకోవటం ప్రారంభించారు. ముఖ్యంగా పత్తి రైతులు జోరుగా విత్తనాలు విత్తుకుంటున్నారు.
జిల్లాలో వానకాలం సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో పత్తిపంట సాగు అవుతుంది. ఇప్పటికే 80 వేల ఎకరాల్లో రైతుల పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వరి, పెసర, మినుము, కంది పంటల సాగును సైతం రైతులు ప్రారంభించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తుండడంతో వానకాలం సీజన్లో సాధారణ విస్తీర్ణాన్ని అధిగమించి పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.
వానకాలం సీజన్లో జూన్ రెండోవారం నుంచి వర్షాలు కురవటం, రైతులు విత్తనాలు విత్తుకోవటం ప్రారంభమవుతుంది. అయితే జూన్ మొదటి వారం నుంచే జిల్లాలో వర్షాలు కురవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వారం రోజులుగా జిల్లాలో వర్షం జోరుగా కురుస్తున్నది. జిల్లాలో గురువారం వరకు 45.5 మి.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా 86.2 మి.మీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 89.3 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
13 రోజుల్లో అత్యధికంగా న్యాల్కల్ మండలంలో 13.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. కందిలో 13.5సెం.మీ., పుల్కల్లో 13.2, కల్హేర్లో 12.6, నాగల్గిద్దలో 12 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిన్నారం, ఝరాసంగం, హత్నూర, కొండాపూర్, కోహీర్, రాయికోడ్ మండలాల్లో 10 నుంచి 11 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం ఒక్కరోజు జిల్లాలో 45.5 మి.మీటర్ల సాధారణ వర్షం కురిసింది. నాగల్గిద్ద మండలంలో అత్యధికంగా 51.5 మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 16 మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో రైతులు ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లో విత్తనాలు వేశారని వ్యవసాయ శాఖ తెలిపింది. వానకాలం సీజన్(2024-25)లో 7,24,405 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు.
పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 3.6 లక్షలు కాగా, రైతులు ఇప్పటి వరకు 80వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు కురుస్తున్నందున పత్తి సాగు మరింత ఊపందుకోనుంది. జిల్లాలో ఇప్పటి వరకు 16 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో మొక్కజొన్న, 547 ఎకరాల్లో కంది, 247 ఎకరాల్లో పెసర, 208 ఎకరాల్లో మినుము, 790 ఎకరాల్లో సోయాబీన్, 656 ఎకరాల్లో చెరుకు పంటలను సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరగనున్నది.