అంతా అవినీతిమయం
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి మరీ మితిమీరిందని, అవినీతికి కేరాఫ్‌గా తహసీల్ కార్యాలయాలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు.
- చిన్నస్థాయి ఉద్యోగి నుంచి తహసీల్దార్ వరకు పైసా లేనిది పనికాదు..
- అవినీతికి కేరాఫ్ తహసీల్ కార్యాలయాలు
- ముడుపులు అందజేస్తే .. చకచకా పనులు
- ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లు
- తహసీల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే జంకుతున్న సామాన్యులు
- దళారులు, పైరవీకారులను కలిశాకే పనులు
- పనికో రేటు..లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే
- నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా.. చేతులు తడపనిదే పని కావడం లేదంటున్న బాధితులు
- లేకపోతే ఏదో రకంగా కొర్రీలు పెట్టి పని ఆపేస్తున్నారని ఆరోపణ
- వేలల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు ఇలా బరితెగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సిద్దిపేట. మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు ఉద్యోగులు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానమైన రెవెన్యూ శాఖలో అవినీతి మరీ మితిమీరిందని, అవినీతికి కేరాఫ్‌గా తహసీల్ కార్యాలయాలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముడుపులు అందజేస్తే ఏదైనా సాధ్యం అన్న తరహాలో పనులు జరుగుతాయంటున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరిగిన సంఘటనలను చెప్పుకోవచ్చు. ఆయా మండల కేంద్రాల్లో ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని మరీ రెవెన్యూ అధికారులు దందాలు నడిపిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. కార్యాలయాల్లో పైరవీకారులు చెప్పిందే వేదం. భూముల విషయంలో స్థానికంగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కీలకంగా మారారు. సామాన్యులను పీడించుకుతింటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి రోజురోజుకూ మితిమీరుతున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఇటీవల కాలంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులు, రైతులు తహసీల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. దళారులను, పైరవీకారులను కలిసాకే తహసీల్ కార్యాలయాల్లోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పనికో రేటు నిర్ణయించి దళారులు చెప్పిన విధంగా ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతున్నాయి. లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇటీవల సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 844లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు పోయిన భూమిని సైతం ఇతరులకు స్థానిక తహసీల్దార్ 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై గ్రామస్తుల ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో వచ్చి విచారణ చేశారు. కానీ ఎలాంటి చర్యలు లేవు. ఇక ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా నాలా కన్వర్షన్ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
పైసా లేనిది పని కాదు ..
ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. పైసా లేనిది పని కాదు.. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి తహసీల్దార్ వరకు అంతా వసూళ్లే… కొన్ని మండలాల్లో ప్రైవేట్ వ్యక్తులదే పెత్తనం.. ఆఫీసుకు సంబంధం లేని వారిని ఏర్పాటు చేసుకొని మామూళ్లు తీసుకొని వారికి కావాల్సిన ఫైల్‌ను చక్కబెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. స్లాట్ బుక్ చేస్తే కూడా డబ్బులు తీసుకోనిది రిజిస్ట్రేషన్ చేయడం లేదన్న ఆరోపణలు జిల్లాలో బలంగా ఉన్నాయి. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించినప్పటికీ ఆదనంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించినప్పటికీ చిన్నవాటికి లక్ష, పెద్ద వాటికి రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక భూమి విలువ నుబట్టి తహసీల్ కార్యాలయంలోని బ్రోకర్లు ముంకుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ పని పూర్తి అయితేనే అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే ఏదో రకంగా కొర్రీలు పెట్టి ఆపేస్తున్నారు. పెద్ద రైతులు ఎంత లేదన్న రూ.50 వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తున్నారు. చిన్న రైతుల నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవిగాకుండా డాక్యూమెంట్కు ఒక్కదానికి రూ.1,000 నుంచి రెండు వేల వరకు వసులు చేస్తున్నారు. మరి కొంతమంది ఆఫీసుకు ఫర్నిచర్ కావాలని అడుగుతున్నారు. వారసత్వం, పౌతి వాటికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వేలల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు ఇలా బరితెగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్‌లో ఏకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో గతంలో నలుగురు, ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్‌తో సహా నలుగురుతో పాటు మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఆర్టీవో కార్యాలయాల్లో దాడులు జరగడంతో బ్రోకర్ల షటర్లు క్లోజ్ చేసుకొని గోవా టూర్‌కు వెళ్లారు.
నేరుగా వెళ్తే పనికాదు!
సిద్దిపేట, మే 31: సిద్దిపేట నియోజకవర్గంలోని తహసీల్ కార్యాయాల్లో పనికావాలంటే పైరవీకారులు ఆశ్రయించనిదే కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు తహసీల్ కార్యాలయాల్లో వివిధ సమస్యలపై రైతులు, ప్రజలు నేరుగా వెళ్తే ఫైళ్లు ముందుకు కదలడం లేదు. పని కావాలంటే ఎవరో ఒకరు మధ్యవర్తిగా వెళ్లి చేయించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. భూముల రేట్లు పెరిగిపోవడం భూ రికార్డుల్లో సవరణలు, ఇతర భూసంబంధమైన పనులు సకాలంలో జరగక రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పైరవీకారుల ద్వారా వస్తేనే అధికారులు వేగంగా పనులు చేస్తున్నారని, తాము నేరుగా వెళ్తే పనులు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
డాక్యుమెంట్‌కు రూ.1000 చెల్లించాల్సిందే..
- చేర్యాల తహసీల్ కార్యాలయంలో పెరిగిపోతున్న అవినీతి
చేర్యాల, మే 31 : సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్ కార్యాలయంలో రోజురోజుకు అవినీతి పెరిగిపోతున్నది. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. అనంతరం తహసీల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్స్‌తో మ్యుటేషన్ అయ్యి రికార్డులకు భూములు ఎక్కేవి. ధరణి పోర్టల్ ఏర్పాటు అనంతరం వ్యవసాయ భూములు మొత్తం తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవుతుండడంతో తహసీల్ అధికారులు, సిబ్బందికి రోజువారీగా డబ్బులు ముడుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లకు వచ్చిన రైతు నుంచి కార్యాలయంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని అధికారులు నియమిస్తున్నారు. సదరు సిబ్బంది రిజిస్ట్రేషన్స్‌కు వచ్చిన రైతుల నుంచి రూ.1,000 నుంచి 2,000 వరకు డ్యాకుమెంట్ వారీగా వసూలు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసే విషయంలో అధికారులు ఎకరా విలువను బట్టి డబ్బులు మాట్లాడుకొని పనులు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్లో ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.20వేలు ఉంటే అధికారులు ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్న వ్యక్తుల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై చేర్యాల తహసీల్దార్, ఆర్ఐని వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ తహసీల్ కార్యాలయానికి వెళ్లేగా ఎవరూ అందుబాటులో లేరు.
గజ్వేల్ ‘తహసీల్’లో పైరవీకారులదే పైచేయి
గజ్వేల్, మే 31: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్ కార్యాలయంలో డబ్బులు ముట్టనిదే ఏపని కావడం లేదు. భూ సమస్యలపై రైతులు తహసీల్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పనులు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్ కార్యాలయంలో పైరవీకారులను ఆశ్రయిస్తేనే పనులు జరిగిపోతున్నాయి. పైరవీకారులు సమస్యను బట్టి డబ్బులు తీసుకొని అధికారులతో పనులు చేయిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా రూ.30 నుంచి రూ.40 లక్షలకు ఎకరా భూమి ధర పలుకుతున్నది. వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్ కార్యాలయాల్లో చేతులు తడపనిదే పనులు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

