ఆరుగాలం కష్టించి పంట పండించే రైతును సైతం అవినీతి అధికారులు వదలడం లేదు. గత మే నెల లో నర్సాపూర్ వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీడ్స్ ధ్రువీకరణ పరిష్మన్ ఇచ్చేందుకు ఏవో లంచం డిమాండ్ చేశాడు. విత్తన కంపెనీలు, సీడ్స్ షాపుల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు ప్రతినెలా మామూళ్లు తీసుకుంటున్నార నే ఆరోపణలు జోరుగా వినబడుతున్నాయి. ప్రతిప నికి రేటు కడుతూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ఇటీవల మెదక్ జిల్లా హవేళీఘనపూర్ ఎస్సై ఆనంద్‌గౌడ్ అవినీతి అధికారులకు దొరకిపోయాడు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను వదిలేందుకు ఎస్సై రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనికి ఇరువురి మధ్యన రూ. 20 వేలకు బేరం కుదిరింది. టిప్పర్ యజమాని ఎస్సైకి లంచం డబ్బులు ఇస్తుండగా అవినీతి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో సైతం మెదక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇసుక ట్రాక్టర్లు విడుదల చేసేందుకు కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు దొరికాడు.
సిద్దిపేట, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): లం చం..లంచం ఇది లేనిదే ఏ పని కావడం లేదు. అది రెవెన్యూ ఆఫీసు కావచ్చు, పోలీస్‌స్టేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు… ఇలా ఒకటేమిటి ఏశాఖ చూసినా అవినీతితో కంపు కొడుతున్నది. ఏ పనికైనా చేయి తడపనిదే పనికావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1615 గ్రామ పంచాయతీలు, 68 మండల పరిషత్‌లు, 3 జిల్లాలు , మున్సిపాలిటీలు 18 ఉన్నాయి. ఒక్కో అఫీసు చుట్టూ నెలల తరబడి తిరిగినా పనులు కావడం లేదని, డబ్బులు ఇస్తే నిమిషాల్లో ఇట్టే పనులు పూర్తి అవుతున్నాయంటున్నారు. పనిని బట్టి రేటు నిర్ణయించి మరి ముక్కుపండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక అధికారుల (ఏసీబీ) కంట పడకుంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికారుల అవినీతికి అంతు లేకుండా పోయింది. ఎంత అందితే అంత గుంజుతున్నారు. పనికి తగ్గ రేటును నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేంటి అంటే ఏదో కొర్రీలు పెట్టి పనులు చేయడం లేదు. అధికారితో బేరం కుదరకపోతే పైరవీకారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ప్రతి ఆఫీసులో ఈ మధ్యన పైరవీకారులు ఎక్కువయ్యారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మైనింగ్, విద్య, వైద్య తదితర శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తున్నది. తహసీల్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బరితెగించి మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
సామాన్యులు తహసీల్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.దళారులను, పైరవీకారులను కలిసిన తర్వాతే తహసీల్ కార్యాలయాల్లోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పనికో రేటు నిర్ణయించి దళారులు చెప్పిన విధంగా ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతున్నాయి. లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. మున్సిపాలిటీల్లో అవినీతి కంపుకొడుతున్నది. టౌన్ ప్లానింగ్ విభాగంలో చేయి తడపనిదే పనులు కావడం లేదు. చేయి తడిపితే త్వరగా పనులు పూర్తి అవుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు అంతా ఒక్కటవుతున్నారు. ఎవరి స్థాయిలో వారు దండుకుంటున్నారు. దీంతో ఎవరిపైనా పర్యవేక్షణ లేకుండా పోయింది. ఒక ప్రధాన శాఖలో జిల్లాస్థాయి అధికారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు సమాచారం. ధిక్కార స్వరం తో కిందిస్థాయి అధికారులు పైస్థాయి అధికారుల పట్ల మాట్లాడుతున్నట్లు ఆ శాఖలోని కొంతమంది ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. వారిపై కఠిన చర్య లు లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఆరు నెలలు పూర్తయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకునే వారు కరువయ్యారు. మంత్రులు కనీసం జిల్లా అధికారులతో రివ్యూలు నిర్వహిం చడం లేదు. దీంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు పైరవీకారులుగా మారి అవినీతి అధికారులతో అంటకాగి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం.