పటాన్చెరు/జహీరాబాద్, నవంబర్ 15 : ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్‌శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీసులు కార్డన్ సెర్చ్‌లు చేపడుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామేశ్వరబండ గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీలో నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. శాంతి భద్రత పరిరక్షణకు ప్రాధ్యానమిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కమ్యూనిటీ కాంటాక్ట్ , నాకాబందీ,కార్డన్ సెర్చ్‌లు చేపడుతున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు.
రామేశ్వర్ బండా గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీలో అనేక రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారని, ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు చెందిన వారు ఇక్కడ నివాసం ఉండడంతో నేరస్తులు తలదాచుకునే అవకాశం ఉందన్నారు. నేరస్తులు దొంగలించిన ఆస్తులు, అనుమానాస్పద వస్తువులు నిల్వ చేయడానికి అవకాశం ఉందని డీఎస్పీ అన్నారు. 220 మంది పోలీసులతో 4 బృందాలుగా విడిపోయి ఔటర్ కార్డన్లు , హోల్డింగ్ పాయింట్ కట్-ఆఫ్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. తనిఖీల్లో 205 మంది అనుమానితులను, పాపిలాన్ డివైజ్ ద్వారా పరీక్షించి, అందులో నలుగురు వ్యక్తులు గతంలో నేరచరిత్ర గల వారిగా గుర్తించామన్నారు. 62 బైక్‌లు, 17 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 15 వాహనాలకు జరిమానా విధించామని, 17 వాహనాలకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించామని, నేరాల నియంత్రణకు తనిఖీలు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. తనిఖీల్లో పటాన్చెరు సీఐలు వినాయక రెడ్డి, సుభాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణ పరిధిలోని భరత్‌నగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.పోలీసులు ఇంటింటికీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 32 బైక్‌లు, 14 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో ఎయిర్‌గన్, దుప్పికొమ్ములు లభించాయి. అనంతరం డీఎస్పీ సైదానాయక్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువు, క్రీడల్లో రాణించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డులు ఉంటేనే ఇండ్లను అద్దెకు ఇవ్వాలన్నారు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సైదానాయక్ సూచించారు. కార్డన్ సెర్చ్‌లో జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు శివలింగం, హనుమంతు, ఎస్ఐలు వినయ్‌కుమార్, కాశీనాథ్, రాజేందర్‌రెడ్డి, నరేశ్, సుజిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.