మెదక్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మనఊరు-మనబడి కింద పలు పాఠశాలల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చేపట్టిన పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు బిల్లులు రాక, చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. దీంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాల తాళం తీయకుండా ఎస్ఎంసీ చైర్మన్లు ధర్నా చేశారు. దీంతో పాఠశాల లోపలికి వెళ్లే విద్యార్థులు గంటపాటు బయటే వేచి ఉన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్మన్లు దశరథం, శంకర్, శ్రీనివాస్ మాట్లాడుతూ… మన ఊరు-మనబడి కింద చేసిన పనికి సంబంధించి పనులు చేసి దాదాపు రెండేండ్లు గడిచినా ఇప్పటివరకు బిల్లులు రాలేదని వాపోయారు. ఉపాధ్యాయులను, విద్యార్థులు పాఠశాలలోనికి వెళ్లకుండా అడ్డుకున్నామని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కింద చేసిన పనులకు బిల్లుల విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుకూర్చున్నారు.
బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి పనులు చేశామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని తెలిపారు. బిల్లులు చెల్లించకపోతే మండలాల్లోని పాఠశాలలకు కూడా తాళం వేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎంసీ చైర్మన్లు దశరథం రూ.12 లక్షలు, చిన్నఘణపూర్కు చెందిన శంకర్ రూ.14 లక్షలు, అవుసులపల్లి లక్ష్మణ్ రూ.6.50 లక్షలు, వడ్డెర కాలనీ సాయిలు రూ.3 లక్షలు, మక్తభూపతిపూర్ ముష్టి శ్రీనివాస్ రూ.12 లక్షలు. మెదక్ జిల్లావ్యాప్తంగా రూ.10.64 లక్షల మన ఊరు-మన బడి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల విషయమై ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో నీలకంఠం వారితో మాట్లాడి చేసిన పనులకు బిల్లులు ఇప్పిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.