పటాన్చెరు, ఆగస్టు 12 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం నుంచి ప్రవహిస్తున్న వాగును ముత్తంగి, పాశమైలారం, కర్ధనూర్ శివారుల్లో ఆక్రమణకు గురైం ది. వాగు బఫర్ జోనును ఆక్రమించి ప్రహరీల నిర్మా ణం చేశారు. రియల్ వ్యాపారులు వాగును ఆక్రమించినా నీటిపారుదల, రెవెన్యూ శాఖ ల అధికారులు ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పటాన్చెరు మండలం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పాటు ఓఆర్ఆర్కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు కొనుగోలు చేసి రియల్ వ్యాపారులు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం చేసి అమ్మకాలు చేస్తున్నారు. పాశమైలారం శివారు నుంచి ప్రవహిస్తున్న వాగును కొందరు ఆక్రమించినా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాశమైలారం పారిశ్రామిక వాడకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా వాగు ప్రవహిస్తుంది.
కొందరు రియల్ వ్యాపారులు వాగుకు సమీపంలోని భూములు కొనుగోలు చేసి వాగును ఆక్రమించారు. పెద్దగా ఉన్న వాగును చిన్నకాల్వ మాదిరిగా చేశారు. భారీ వర్షాలు పడితే ప్రమాదం ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు నివారించే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. పాశమైలారం, కర్ధనూర్, ముత్తంగి శివారులో ప్రవహిస్తున్న వాగును రియల్ వ్యాపారులు ఆక్రమించి, వాగుకు ఇరువైపులా గోడల నిర్మాణం చేయడంతో ప్రకృతి సిద్ధ్దంగా ప్రవహించే ఈ వాగు చిన్నగా కుచించుకు పోయింది.
నీటిపారుదల శాఖ అధికారులు రియల్ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిల్లో పరిశీలించకుండా, కార్యాలయల్లో రికార్డులు పరిశీలించి ఎన్వోసీలు జారీ చేస్తున్నారనే అపవాదు ఉంది. పటాన్చెరు నీటిపారుదలశాఖ కార్యాలయంలో కొందరు అధికారులు చాలా ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. వారు వాగులు, కాల్వలను పరిశీలించకుండానే ఎన్వోసీలు జారీ చేస్తున్నారని తెలిపింది. నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారు ల అవినీతి అక్రమాలతో వాగులు మాయమవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షాలు కురిస్తే ముంపు సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిసింది. నీటిపారుదల, రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు ఎన్వోసీల కోసం మధ్యవర్తులను నియమించుకుని వ్యవవహారం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఎన్వోసీ చేతికి రావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయంలో డబ్బులు ఇవ్వకపోతే పెం డింగ్‌లో పెట్టి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించకుంటే వాగులు పూర్తిగా మాయమయ్యే పరిస్థితులు ఉంటాయి. తద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచే ప్రమాదం ఉంటుంది.
భూముల విలువ భారీగా పెరిగిపోవడంతో వాగులు, కాలువలను రియల్ వ్యాపారులు కబ్జాలు చేస్తూ మింగేస్తున్నారు. పూర్వకాలం నుంచి ప్రకృతి సిద్ధ్దంగా ప్రవహిస్తున్న వాగులు, వరద కాల్వలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, వాగులను ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్నారు. వాగు బఫర్ జోన్ పరిధి 9 మీటర్ల వరకు ఉంటుంది.
బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేసేందుకు అనుమతి లేదు. కానీ, కొందరు వాగులను ఆక్రమించి నీటిని మళ్ల్లించేందుకు గోడలు నిర్మాణం చేస్తున్నారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్ వ్యాపారులు వాగులను కుదించి ప్రహరీల నిర్మాణం చేపడుతున్నారు. కొందరు గోడలు కట్టినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భారీ వర్షాలు కురిస్తే వరద ముందుకు పోవడానికి వీలు లేకుండా పోతున్నది. కాలనీల్లో వరద ముంపు సమస్య తలెత్తుతున్నది.