సదాశివపేట, జూన్ 8 : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో వాగులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణ సమీపంలోని శ్రీనిధి నియో సిటీ పేరుతో వెలసిన వెంచర్ అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఉపయోగకరంగా ఉన్న ఈదుల వాగును మాయం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో పాటు నాలుగైదు పిల్లకాలువలను సైతం ఆక్రమించి వాటిపై బ్రిడ్జీలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. కాలువలను పూడ్చి వేసి దర్జాగా సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. మరో వైపు చిన్న చిన్న కాల్వలను మూసివేసినా అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. వాగు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా అధికారులు‘మామూలు’గానే తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నియోసిటీకి ఎన్వోసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు..
వాగులు, చెరువుల ఆక్రమణను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.సదాశివపేట పట్టణ శివారులోని శ్రీనిధి నియోసిటీ వెంచర్ నుంచి ఈదులవాగు, మరో నాలుగైదు చిన్నకాల్వలు ప్రవహిస్తున్నాయి.
ఎన్నో ఏండ్లుగా ప్రవహిస్తున్న ఈదులవాగును వెంచర్ యాజమాన్యం ఆక్రమించి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఈదులవాగు, చిన్న కాల్వల విస్తీర్ణం పరిశీలించకుండానే వెంచర్‌కు ఇరిగేషన్ అధికారులు ఎన్వోసీ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తున్నది. వాగులను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణదారులకు వత్తాసు పలకడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘మామూలు’గానే తీసుకుంటున్న అధికారులు..
చెరువులు, వాగులపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటున్నారు. సదాశివపేట పట్టణ సమీపంలోని సర్వే నెంబర్ 696, 702, 703,704,705,706,707,708,711,712లలో శ్రీనిధి నియో సిటీ వెంచర్ నిర్మాణాలు చేస్తున్నది. పూర్తి స్థాయిలో నాలా కన్వర్షన్ చేయకుండానే వ్యవసాయ భూములను వెంచర్లుగా చేస్తున్నారు.
వెంచర్ ఏర్పాటుకు రేరే, ఎల్పీనెంబర్, హెచ్ఎండీఏ అనుమతులు ఉండాలి. కానీ, అవేవి చేయకుండానే వ్యవసాయ భూములను గజాల్లో విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రకృతి వనరులైన వాగులను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణదారులకు వత్తాసు పలకడం పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమంగా వాగులపై నిర్మాణాలు చేపట్టిన వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.