పటాన్చెరు, జూన్ 1: ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం, పూలు, అన్ని ఒకేచోట దొరికేలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అమీన్పూర్లో మున్సిపల్ అధికారులు టెండర్లు వేసి భవన నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు అప్పుగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల పనులు మధ్యలో నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్లో పరిధిలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి.
అసంపూర్తిగా ఆగిన పనులు పూర్తిచేసేందుకు ప్రస్తుత పాలకులు చర్యలు తీసుకోవడం లేదు. అమీన్పూర్లో విశాలమైన స్థలంలో సుమారు రూ. రెండు కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో పనులు ప్రారంభించారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజలకు మాంసం, చికెన్, చేపలు, కూరగాయలు, పూలతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులు ఒకే దగ్గర లభించడంతో సౌకర్యంగా ఉంటుంది. అమీన్పూర్ హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కూరగాయలు, మాంసం, ఇతర వస్తువులు కావాలంటే వారంతా రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరుకు వెళ్లాల్సి వస్తున్నది. మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదని తెలిసింది.
అమీన్పూర్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ పనులు వెంటనే పూర్తిచేయాలి. మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు అప్పట్లో మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి పనులు పూర్తిచేయించాలి. అమీన్పూర్ ప్రాంతంలో లక్షలాది మంది జీవిస్తున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి.
-ఐలాపూరం మాణిక్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు