సంగారెడ్డి, జనవరి 10(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లాలో యథేచ్చగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని ఓడిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ హంగామా చేస్తున్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీశ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి వేదికపై గళం వినిపిస్తున్నారు. కానీ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల జరిగిన మహిళల ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం, ప్రజాపాలన కార్యక్రమాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి లేకుండా ప్రారంభించారు. ప్రజాపాలన ఫ్లెక్సీలపై ఎమ్మెల్యేల ఫొటోలను ముద్రించలేదు. ఇటీవల నారాయణఖేడ్‌లో నల్లవాగు ప్రాజెక్టు నుంచి సాగునీటిని మంత్రి దామోదర, ఎమ్మెల్యే సంజీవరెడ్డి విడుదల చేశారు. కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలకలేదు. ప్రొటోకాల్ ఉల్లంఘనల అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాణిక్‌రావు ఇటీవల జరిగిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ నిర్వహించిన సమావేశంలో, మంగళవారం జరిగిన జడ్పీ సమావేశంలోనూ లేవనెత్తారు.
నిబంధనల మేరకు ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ అమలుచేయాలని ప్రభుత్వాన్ని, అధికారులు కోరారు. తాజాగా బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారు. ‘మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేయిస్తారు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా మేడం వచ్చేవరకు చెక్కుల పంపిణీ చేయవద్దు.. మా మేడం వచ్చిన తర్వాతే చెక్కు లు లబ్ధిదారులకు అందజేయాలంటూ’ కాంగ్రెన్ నేతలు పట్టుబట్టారు. గంటన్నరపాటు వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే ప్రభాకర్ తాను రెండు చెక్కుల పంపిణీ చేస్తానని, ఆ తర్వాత కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయించాలని అధికారులు, కాంగ్రెస్ నేతలకు సూచించారు. అయినా స్పందన లేకపోవడంతో ప్రభాకర్ చెక్కుల పంపిణీ చేయకుండా వెనుదిరిగారు. చింతా ప్రభాకర్ వెనుదిరిగిన కొద్దిసేపటి తర్వాత కాం గ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఏ హోదాలో నిర్మలారెడ్డి చెక్కులు పంపిణీ చేస్తారని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారిక యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడం లేదు. ఇందుకు బుధవారం ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. సంగారెడ్డి టీఎన్జీవో భవన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి మండలం, మున్సిపాలిటీలోని 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎమ్మెల్యే ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేయాలి. కానీ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. అలాగే సదాశివపేటలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యే హాజరైనా నిర్మలారెడ్డి వచ్చేవరకు చెక్కుల పంపిణీ ప్రారంభించలేదు. నిర్మలారెడ్డి ఏ హోదాలో చెక్కుల పంపిణీ చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ప్రభాకర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తనను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, అధికారులు ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాల్లా మార్చవద్దని అధికారులను కోరారు.