అందోల్, అక్టోబర్ 6: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని.. ఎన్నికల ముందు రజినీ.. ఎన్నికల తర్వాత గజినీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇంటికి పంపేందుకు ప్రజలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ కేసీఆర్ రావాలంటూ నినదిస్తున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి జంబిచెట్టుకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మంచిపై చెడు సాధించే విజయమే దసరా పండుగ అని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అభినందనీయుడన్నారు. కాంగ్రెస్ ధోకా పార్టీ అని, అవ్వ, తాతలకు సమయానికి పింఛన్లు రావు… కొత్తగా ఇస్తామన్న పింఛన్ డబ్బులు పెంచరు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, రూ. 2500 ఇవ్వకుండా ప్రభుత్వం బాకీ పడ్డదన్నారు. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాలకు బాకీ పడిన ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ఇంటింటికీ బాకీకార్డులు పంపిణీ చేయాలన్నారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుని సంగారెడ్డి జడ్పీపై మరోసారి గులాబీజెండా ఎగురవేస్తామన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నదన్నారు.
కేసీఆర్ నిర్మించిన వాటికే కట్టింగ్ మాస్టర్లుగా చేతిలో కత్తెర పట్టుకుని రేవంత్‌రెడ్డి కటింగ్ చేస్తూ వెళ్తున్నారని మండిపడ్డారు. ఒక్క పథకం సక్రమంగా అమలు చేయడంలేదని, బోనస్ బోగస్ అయ్యిందన్నారు. వడ్లు, పత్తికొనరు, కనీసం రైతులకు యూరియా అందించడం కూడా చేతకాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముందు చూపుతో ఎన్నో పథకాలు తీసుకొచ్చి రాష్ర్టాన్ని దేశానికి రోల్ మోడల్‌గా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఢిల్లీకి మూటలు మోయడంలో రోల్‌మాడల్‌గా నిలుస్తున్నాడని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ఆదాయం పెంచి అభివృద్ధి పర్చడం చేతకాక నియోజకవర్గానికి ఒక బ్రూవరీస్ ఏర్పాటు చేసి ప్రజలను తాగుడుకు బానిసలుగా మార్చి మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచాలనే నీచమైన ఆలోచనతో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
అధికారంలోకి వస్తే బెల్ట్దుకాణాలు మూసివేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ అమ్మకాలతోనే ప్రభుత్వం కొనసాగించాలనే తపనతో ఉన్నదని విమర్శించారు. అందుకోసం సంబంధిత అధికారులపై సైతం ఒత్తిడి తెస్తున్నారని, అమ్మకాల్లో అనుకున్న లక్ష్యం చేరని అధికారులకు శాఖాపరమైన చర్యలు, స్థాన చలనం తప్పడం లేదన్నారు. ఓసారి కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు..మరో సారి కాళేశ్వరం ఎందుకు పనికి రాదంటారు..? మళ్లీ అదే కాళేశ్వరం నుంచి నీళ్లు తరలించి క్రెడిట్ తమదే అంటారని విమర్శించారు. కేసీఆర్ చెమటచుక్కలతో చెక్కు చెదరకుండా నిర్మించిన కాళేశ్వరం ఎన్నటికైనా రైతాంగానికి జీవానదారం అని, కాంగ్రెస్ దీనిపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరన్నారు.
వట్పల్లిరోడ్లపై మోకాలులోతు గుంతలు పడి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవుకానీ… ప్యూచర్ సిటీ పేరుతో ఎవరు ఉండని అడవిలో సుందరీకరణ పేరుతో వేలకోట్లు ఖర్చు చేసేందుకు సీఎం దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. వట్పల్లి రోడ్లకు మరమ్మతులు చేస్తే సీఎంకు కమీషన్లు రావు… అదే ప్యూచర్ సిటీ అంటే వేల కోట్లు కమీషన్ వస్తుందని, కాంగ్రెస్ అంటేనే కమీషన్లు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపేసిందన్నారు. రైతులు, ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పథకమైనా ప్రభుత్వం నిలిపివేస్తే సహించేది లేదన్నారు.
బసవేశ్వర- సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించే వరకు వదిలిపెట్టే ప్రసక్తేలేదని, దీనిపై నాలుగు నియోజకవర్గాల రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాదయాత్ర, నిరసనలు చేపడుతామన్నారు. బీజేపీ తీరుపై మండిపడిన హరీశ్‌రావు ఆ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నా ఏం లాభం లేదన్నారు. ఉత్తర భారతదేశంలో గోధుమలకు ఓ రకమైన మద్దతు ధర.. తెలంగాణలో పండే ధాన్యానికి మరో రకం ధర దక్కుతున్నా వారు నోరు మెదపరని, జిల్లాలో నవోదయ అంటారు… కానీ ఒక్కటి ఇవ్వరని.. బడ్జెట్లో రూపాయి రాద ని… బీజేపీ అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసే పార్టీ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని, స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమలో మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మారుతీసాగర్, నాయకులు రాహుల్‌కిరణ్, ప్రతాప్‌లింగాగౌడ్, జైపాల్‌రెడ్డి, రజినీకాంత్, అశోక్‌గౌడ్, వీరారెడ్డి, శివాజీరావు, మధు పాల్గొన్నారు.