యాదాద్రి భువనగిరి : మహిమాన్విత యాదగిరిగుట్టపై(Yadagirigutta) పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి ఆస్థానం చేశారు. నాలుగు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠనాలను కనుల పండువగా చేపట్టారు.
దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు అవతార రూపాల్లో స్వామివారిని ఉత్సవాల్లో అలంకరించి సేవించడం ప్రత్యేకత అంటూ ప్రధానార్చకులు మత్స్యావతార విశిష్టతను వివరించారు. పట్టు వస్ర్తాలు, బంగారు, వజ్రా భరణాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య మంగళకరంగా అలంకరించిన స్వామి వారిని కొలుస్తూ మంత్రోచ్ఛరణలు, మూలమంత్ర జప స్తోత్రాలు సాగుతుండగా గోవిందనామ స్మరణ మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త బీ. నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.