లండన్: ప్రిన్స్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మాంట్బాటన్-విండర్స్(Andrew Mountbatten-Windsor)ను పోలీసులు రిలీజ్ చేశారు. ఎప్స్టీన్కు వాణిజ్య రహస్య సమాచారాన్ని చేరవేసిన కేసులో ఆయన్ను థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో ఉండగానే ఆయన్ను పోలీసు కస్టడీ నుంచి రిలీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్పై ఆరోపణలు ఉన్నాయి. గురువారమే మాజీ ప్రిన్స్ ఆండ్రూ రోజంతా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. థేమ్స్ వ్యాలీ పోలీసు డిటెక్టివ్లు ఆయన్ను ప్రశ్నించారు. బ్రిటన్ ప్రత్యేక వాణిజ్య రాయబారిగా ఉన్న సమయంలో ఆయన జెఫ్రీ ఎప్స్టీన్కు కొన్ని వాణిజ్య నివేదికలను, దేశానికి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని పంపారన్న ఆరోపణలపై తాజాగా ఆండ్రూను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.
గురువారం ఆండ్రూను అరెస్టు చేసిన తర్వాత బెర్క్‌షైర్, నార్ఫోల్క్లలో సోదాలు నిర్వహించారు. అతనిపై నమోదైన ఆరోపణల గురించి మాత్రం తెలుప లేదు. అతడి 66వ పుట్టిన రోజున ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. కాగా, కింగ్ చార్లెస్-3 విడుదల చేసిన ప్రకటనలో కూడా ఆండ్రూ అరెస్ట్‌ను ధ్రువీకరించారు. ఆండ్రూ అరెస్ట్‌పై ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానిస్తూ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదన్న సూత్రం తమ దేశంలో తప్పక అమలవుతుందని అన్నారు.
ఆండ్రూ మౌంట్‌బాటెన్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఎప్స్టీన్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నట్టు పలు ఆధారాలతో వెల్లడైంది. ఆండ్రూ తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడని వర్జీనియా గీయుఫ్రే అనే మహిళ ఆమె టీనేజీలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయగా, దానిని ఆయన ఖండించాడు. కేసు కోర్టు విచారణకు వెళ్లకుండా 2022లో రాజీ కుదుర్చుకున్నాడు. దీంతో అతడిని అన్ని రాజరిక విధుల నుంచి తొలగిస్తున్నట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది.