జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుర్గామాత ఆలయం(Durga Temple)పై గురువారం రాత్రి దాడి జరిగింది. దుర్గాపూజ జరుగుతున్న సమయంలో ఆ గుడిపై కొందరు అటాక్ చేశారు. సిహోరా ఆజాద్ చౌక్‌లో ఉన్న ఆలయం గ్రిల్‌ను ఓ వ్యక్తి విరగొట్టాడు. ఆ తర్వాత గుడిని ధ్వంసం చేశారు. మరో వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గుడి గ్రిల్‌ను ధ్వంసం చేసిన వ్యక్తిని చితకబాదారు. స్థానిక పోలీసులు, సీనియర్ అధికారులు, జిల్లా పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంపులను చెదరగొట్టే ప్రయత్నంలో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
ఓ మీడియా కథనం ప్రకారం.. గుడిలో పూజ జరుగుతున్న సమయంలోనే.. సమీపంలో ఉన్న మసీదు లౌడ్‌స్పీకర్ నుంచి నమాజ్ వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. మదీనా మజిద్ అహ్లే సున్నత్ ఆ మసీదును నిర్వహిస్తున్నారు. గుడికి ఎదురుగా ఆ మసీదు ఉన్నది. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ క్షణాల్లో పెరిగిపోయింది. ఇక ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది.
అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. సుమారు 15 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అల్లరిమూకలకు చెందిన వాహనాలను కూడా సీజ్ చేయనున్నారు. కర్నాటకలోని బగల్‌కోట్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శివాజీ జయంతి ఊరేగింపులో కొందరు రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలకు ఆ రాళ్లు తగిలాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట వద్ద ఉన్న జామా మసీదు సమీపంలో కూడా రెండు వర్గాలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.