రాయపోల్, జూన్ 23 : కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కష్టాలు తీరాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడంతో రెండు పంటలు సాఫీగా సాగు చేసుకున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కరెంట్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. దీంతో బోరు బావుల వద్ద నాట్లు వేయాలా వద్దా అని ఆలోచించాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
తెలంగాణ రాక ముందు కరెంట్ ఎట్ల ఉండే గిప్పుడు గదే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ గురించి ఆందోళన లేకుండే. సార్ ఏం చేసిండో ఎమో కానీ మనకు కరెంట్ సమస్య లేకుండా చేసిండు. గిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదా కరెంట్‌కు మళ్లీ పాత రోజులు వచ్చాయి. సార్ ఎన్నికల అప్పుడు చెప్పిండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కష్టాలు తప్పవని గిప్పుడు సార్ చెప్పిందే నిజం కాబట్టే. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్‌కు ఢోకా లేకుండే.
తెలంగాణ ఏర్పడక ముందు పరిశ్రమలకు పవర్ హాలీడే వచ్చాయి. దీని వల్ల పారిశ్రామికవేత్తలు, కార్మికులు తీవ్రఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, రైతులకు నిరంతరంగా కరెంట్ సరఫరా చేశారు. పదేండ్లలో కరెంట్ కష్టాలు లేవు. దీంతో మంచి రోజులు వచ్చినాయని సంతోషపడ్డాం. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అటు రైతులకు, పరిశ్రమలు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు పోతదో తెలియదు. ఎప్పుడు వస్తదో తెలియకుండా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, పరిశ్రమలకు నిరంతరంగా కరంట్ సరఫరా చేస్తేనే రాష్ట్రం ముందడుగు వేస్తది.. లేదంటే రాష్ట్రం దివాలా తీస్తది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కాలేదు. నిరంతరంగా కరెంటు ఉండేది. కానీ ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. కరెంటు సరిగా లేకపోవడంతో రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు.
రాయపోల్,జూన్ 23 : కేసీఆర్ హయాంలో పదేండ్లు కరెంట్ పుల్లుగా వచ్చింది. 2014 కంటే ముందు కరెంట్ కోసం ఎంత తిప్పలైందో గుర్తుకు వస్తుంది. రాత్రిళ్లు మోటర్లకాడనే పడుకొని ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చినంక కరెంట్‌కు రంది లేకుండా గడిపినం. ఇప్పుడేమో మళ్లీ పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి. వానకాలం సాగు చేద్దామంటే కరెంట్ ఇబ్బందులు ఉండడంతో పాటు వర్షాలు కురువక అకాశం వైపు చూస్తున్నాం. ఉన్న నీటిని పారించి సాగు చేద్దామన్నా.. కరెంట్ తిప్పలు తప్పడం లేదు. రాను రానూ మరిన్ని కరెంట్ కొతలు వస్తాయని భయంగా ఉన్నది.