అధికారం అండ చూసుకుని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గూండాయిజం చేస్తూ దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తొలిసీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత కేసీఆర్ క్యాంపు ఆఫీసుపైనే దాడికి పాల్పడ్డారు. ఎన్నో ఏండ్లు పోరాటం చేసి, ప్రాణాలు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చారనే సోయి కూడా లేకుండా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆఫీస్ విషయంలో చిల్లరగా వ్యవహరించారు. డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి కాంగ్రెస్ నాయకులు,
మందీమార్బలంతో శనివారం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని, నానా హంగామా సృష్టించారు. క్యాంపు కార్యాలయం ప్రధాన గేట్ తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించి బలవంతంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని గోడకు పెట్టడంతో పాటు ప్రధాన డోర్ అద్దాలు ధ్వంసం చేయడం, మట్టిపెల్లలు పడేయడం, విండో కర్టెన్లు చింపెసే ప్రయత్నం చేసి వీరంగం సృష్టించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను గౌరవించాల్సింది పోయి, డీసీసీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఇలాంటి చిల్లర పనులకు పాల్పడడంతో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గజ్వేల్, ఏప్రిల్ 4: ప్రతిపక్ష నేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని శనివారం కాంగ్రెస్ నాయకులు ముట్టడించి, ఆఫీస్‌పై దాడికి పాల్పడడంతో పట్టణంలో శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని తీసుకొని ఆమె నివాసం నుంచి వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరకున్నారు. క్యాంపు కార్యాలయం ప్రధాన గేట్ తాళాలు పగులగొట్టి, కార్యాలయంలోకి ప్రవేశించి రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని గోడకు పెట్టారు.

అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు. కార్యాలయంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు గూండాల్లా ప్రవర్తించి ప్రధాన డోర్ అద్దాలు ధ్వంసం చేసి మట్టిపెల్లలు పడేశారు. కార్యాలయంలోని విండో కర్టెన్లు చింపెసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపు కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై దాడికి యత్నించేందుకు వెళ్లగా, వారు హుటాహుటిన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళం వేసి అందరినీ బయటకు పంపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులను అదుపు చేయలేదు.
అనంతరం అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశం లేదంటూ పోలీసులు బయటనే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని సంఘటనా స్థలంలో పగిలిన కిటికీని పరిశీలించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. పోలీసులు సిబ్బందికి అక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు మాట్లాడారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ చెప్పడంతో వంటేరు శాంతించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులు తొలిగించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పీఎస్‌కు చేరుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడడంతో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో దారిని మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 4: నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ ప్రావీ ణ్య దృష్టికి తీసుకొచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. టీజీఐఐసీకి భూముల కేటాయింపు ప్రక్రియతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా చిమ్నాపూర్ గ్రామస్తుల భూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. సైదాపూర జీపీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కంది మండలం బేగంపేటలో వాటర్ ట్యాంక్ ప్రభుత్వ స్థలంలో ఉండగా గ్రామానికి చెందిన కొందరు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్రమాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

దుబ్బాక, ఏప్రిల్ 4: రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల రాజ్యం కొనసాగుతున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య అని, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి అశాంతిని సృష్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధికి గజ్వేల్ మైలురాయిగా నిలిచిందన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
– బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చేర్యాల, ఏప్రిల్ 4: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయనీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి శనివారం పల్లా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. దాడికి పాల్పడిన దుండగులను పోలీసులు గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జహీరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడి పిరికిపంద చర్య అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో లా అండ్ అర్డర్ పూర్తిగా అదుపుతప్పిందన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ గూండాల అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోయిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ చేసేందుకే రేవంత్‌రెడ్డి ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
-జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
హుస్నాబాద్, ఏప్రిల్ 4: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి అమానుషమైన చర్య అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం కాంగ్రెస్ గూండాగిరీ, రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఉండి కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పడం ఆంక్షారెడ్డికి తగదన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి తన గూండా రాజ్యాన్నే నడిపిస్తున్నాడని దుయ్యబట్టారు.
-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
అందోల్, ఏప్రిల్ 4: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. అధికార భవనంపై దాడిచేసి ఫొటోలు చించివేయడం, ఫర్నిచర్ ధ్వంసంచేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, బెదిరింపులతోనే కాలం వెల్లదీస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
– మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్
సిద్దిపేట, ఏప్రిల్ 4: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూం డాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడులకు పాల్పడ్డ వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ సాధించి పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కార్యాలయంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రేరేపించిన దాడిగా భావిస్తున్నాం. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ నాయకులు ఎక్కువ స్థానాలు గెలువక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్కడా సీఎం ఫొటో పెట్టాలని చట్టంలో లేదన్నారు.
– వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
రామచంద్రాపురం, ఏప్రిల్ 4: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై దాడిచేయడం కాంగ్రెస్ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. గజ్వేల్ పీఎస్‌కు కొద్దిదూరంలోనే దాడి జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. పట్టపగలు అక్రమంగా క్యాంపు కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే చర్య అని మండిపడ్డారు.
– బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి