మెదక్ : కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ (Sitaram Naik) ఆరోపించారు. బుధవారం మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా కాంగ్రెస్ ( Congress ) పార్టీ గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని పేర్కొన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ( Sevalal Maharaj) ఉత్సవాలను జరపలేదని చెప్పారు. తెలంగాణలో జనాభాలో గిరిజనులు ఏడు శాతం ఉండగా కాంగ్రెస్ ఐదుగురికి మాత్రమే టిక్కెట్ ఇచ్చిందన్నారు. జనాభాలో మూడు శాతం ఉన్న కులస్తులకు రేవంత్రెడ్డి (Revanth Reddy) ఏడు సీట్లు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గిరిజనులు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారిని దగ్గరకు రానివ్వద్దని చెప్పారు. మా తండా మా రాజ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, అందుకు అనుగుణంగా తండాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవాలాల్ జయంతి ఉత్సవాలను గిరిజనుల (Tribals) కు వివిధ పథకాల ప్రవేశపెట్టినట్లు వివరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు భూముల హక్కు కల్పించారని వివరించారు. తిరిగి కేసీఆర్ (KCR) ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన జాతి మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి(Padma Devendar Reddy) మాట్లాడుతూ 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు తెలుసని, కష్టాలు ఉన్నచోట కేసీఆర్ సంక్షేమ పథకం ఉంటుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్నారు.