చేర్యాల, ఏప్రిల్ 25: రాష్ట్రంలో సుస్థిర పాలన పోయి రాక్షస పాలన వచ్చిందని, కాంగ్రెస్ 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు విరక్తి చెందారని, తిరిగి కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 27న జరిగే రజతోత్సవ మహాసభను ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ సత్తా చాటాల్సిన సమయం అసన్నమైందన్నారు.కొమురవెల్లి మండల మర్రిముచ్చాల గ్రామ మాజీ సర్పంచ్ పద్మకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రజతోత్సవ సభ వాల్పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం చేర్యాల మండలంలోని ఆకునూరు నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరడంతో వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామశాఖల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.