నంగునూరు, అక్టోబర్ 19: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో శనివారం ఆయిల్‌పామ్ రైతులకు జరిగిన అవగాహన కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రికి, జిల్లా మం త్రికి సమాచారం లేకుండా ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎలా హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు.
ఆయిల్‌పామ్ రైతుగా గుర్తింపు ఉన్నవారే అవగాహన సదస్సుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. కార్యక్రమానికి వెళ్తున్న రైతులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా..కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు.
చివరకు ఆయిల్‌పామ్ రైతులుగా గుర్తింపు ఉన్న వారిని మాత్రమే సమావేశానికి అనుమతించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్ నాయకుల తీరు సరికాదని.. వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించినా కాంగ్రెస్ నాయకులు కావాలని రాద్ధ్దాంతం చేయ డం సరికాదన్నారు. అనంతరం రైతుభరోసా విడుదల చేయకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు తగుల బెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.