సంగారెడ్డి, మే 4(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీలు హస్తం పార్టీలో చిచ్చురేపాయి. ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుటే కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని నిలదీసి గొడవకు దిగారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీసీసీ సమావేశం వేదిక వద్దకు దూసుకువచ్చి రచ్చరచ్చ చేశారు.
పార్టీ ఇన్చార్జితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల గొడవతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశం వేదికపైనే ఉన్న మంత్రి దామోదర రాజనర్సింహ గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా మౌనం వహించారు. జిల్లా ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి నచ్చజెప్పినా కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ ఆపకపోవడంతో చివరకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కలుగజేసుకుని నాయకులు, కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అధ్యక్షతన ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఓ హోటల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి , జిల్లా ఇన్చార్జి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సహా ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ పటిష్టత, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధ్దత తదితర అంశాలే ఎజెండాగా సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో జహీరాబాద్ ఇన్చార్జి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రాధాన్యత దక్కడం లేదని, ఇండ్ల మంజూరులోనూ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వెంటనే పార్టీ ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి కలుగజేసుకొని ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో సమావేశంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెంటనే రామ్మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు దూసుకువచ్చి రామ్మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్‌సింగ్, ఎల్. రవీందర్, సుధాకర్‌రెడ్డి, గడ్డం శ్రీశైలం, మన్సూర్, రాములు, వేణు తదితరులు రామ్మోహన్‌రెడ్డితో గొడవకు దిగారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు చోటు దక్కలేదని, ఇండ్ల మంజూరులోనూ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పెత్తనం ఏమిటని రామ్మోహన్‌రెడ్డిని నిలదీశారు. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ కోసం ఏండ్లుగా పనిచేసిన నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదంటూ రచ్చరచ్చ చేశారు. దీంతో డీసీసీ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇతర నియోజకవర్గ నాయకులు సైతం ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినా పటాన్చెరు నియోజకవర్గ నాయకులు వెనక్కి తగ్గలేదు. దీంతో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కలుగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చూశారు. పటాన్చెరు నియోజకవర్గ నాయకులతో ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల్లపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
కాంగ్రెస్‌లో గ్రూపులు, గొడవలు సహజమేనని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ర్ట వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, గొడవలు ఇప్పుడు కొత్తవేమి కాదని, గతంలోనూ ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఉన్నా ఎన్నికల్లో గెలుపు సాధించామని గుర్తుచేశారు.
గ్రూపు రాజకీయాలు పార్టీని నాశనం చేసేలా మారవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు పదవులను అనుభవించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడటమే తమ పని అన్నారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సంగారెడ్డిలో ఆదివారం జరిగిన డీసీసీ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫొటో మార్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డిలోని ఓ హాటల్లో డీసీసీ సమావేశం ఏర్పాటు చేయగా, సమావేశం వేదికపైన పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ఫొటోలతో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆహ్వానం పలుకుతూ హోటల్ వెలుపలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
డీసీసీ సమావేశం ప్రారంభం కాగానే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫొటో ఉండడంపై పటాన్చెరు నియోజకవర్గ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫొటో తొలిగించాలని పట్టుబట్టారు. దీంతో డీసీసీ సమావేశం నిర్వాహకులు వెంటనే మహిపాల్‌రెడ్డి ఫొటో తొలిగించి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫొటోను అతికించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఫొటో తొలిగించడం డీసీసీ సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం సంగారెడ్డిలో జరిగిన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు నాయకుడు కాటా శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. ముగ్గురు కీలక నేతలు డీసీసీ సమావేశానికి డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి కొద్దిరోజులుగా మంత్రి దామోదరతో కలిసి వేదికను పంచుకోవడం లేదు. పార్టీ సమావేశాలకు ఆయన దూరంగా ఉంటారు. ఆదివారం జరిగిన డీసీసీ సమావేశానికి జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సైతం డీసీసీ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ మహిపాల్‌రెడ్డి పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ డీసీసీ సమావేశానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరైనట్లు తెలుస్తుంది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అధిష్టానం తీరుపై కాటా గుర్రుగా ఉన్నారు. తన అసంతృప్తిని తెలియజెప్పేందుకే కాటా డీసీసీ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.