సిద్దిపేట, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గూండాల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. అరికట్టాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. మొన్న సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపైన..నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులపై దాడులు, వరుసగా ప్రతిపక్ష నేతలు, ఇండ్ల మీద దాడులు చేస్తూ కాంగ్రెస్ నాయకులు రాక్షసానందం పొందుతున్నారు.
జిల్లాలో జరిగిన దాడులన్నీ అర్ధరాత్రులు..ఈ దాడుల వెనుక అంతర్యమేమిటి..? అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతున్నది. ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తే వారిని అరెస్ట్ చేయరు, కేసులు నమోదు చేయరు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి జరిగినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో పోలీసులు కేసులు నమోదు చేయరు. ఇదెక్కడి పాలన..? అంటూ బీఆర్ఎస్ నాయకులు, వివిధ వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జిల్లా పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. కాంగ్రెస్ గూండాల ఆగడాలను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దాడి చేసిన వారిని గుర్తించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో పోలీస్ అధికారులు పని చేస్తున్నారన్న విమర్శలు బలం గా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరుగలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులకు హాని తలపెట్టలేదు. కాంగ్రెస్ హయాంలో రోజురోజుకూ ఆ పార్టీ నేతల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అయా గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలపై దాడులు, వారిపై పోలీస్ కేసులు పెట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా అరా
చకాలు సృష్టిస్తూ జిల్లాను కాంగ్రెస్ గూండాల రాజ్యంగా మారుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే మాటలతో జిల్లాల్లో క్యాడర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విభాగాలను నిర్వీర్యం చేశారు.
మొన్న సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన, నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై చేసిన అర్ధరాత్రుల దాడుల వెనుక కాంగ్రెస్‌లోని పెద్దల హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడులన్నీ అర్ధరాత్రి పూటనే ఎంచుకుంటున్నారు. దాడులు చేస్తున్న సమయంలో పోలీసులను అటు వైపు వెళ్లవద్దు అని ముందే చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్ద నేతల ఆదేశాలతో పోలీసులు చూస్తూ ఊరుకుండిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను గూండాల రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు.
అభివృద్ధి చేయడం చేత కాదు కానీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలో ప్రశాంత వాతావారణాన్ని పూర్తిగా చెడగొడుతున్నారు. గతంలో ఎప్పడూ ఇలా ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులు జరిగిన సందర్భాలు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జిల్లాలో కాంగ్రెస్ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా రాజకీయపరంగా వారి పార్టీలకు అనుగుణంగా నడుచుకున్నారు. వారివారి పార్టీ సిద్ధాంతాలను చెప్పుకున్నారు. అంతేగాని ఇలాంటి వాటిని ఏపార్టీ వారు ప్రోత్సహించలేదు. ఇలాంటి దాడుల సంస్కృతి ఎప్పుడూ లేదు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై రాత్రి ఘటన జరిగితే కనీసం పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడలేదు.మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్లో జిల్లా ఎస్పీ, ఐజీలతో మాట్లాడే వరకు పోలీసుల్లో కనీసం చలనం రాలేదు. అసలు పోలీసులు జిల్లాలో పని చేస్తున్నారా..? అన్న సందేహం వ్యక్తమవుతున్నది. ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే పోలీసులు కనీసం స్పందించకపోవడం పై బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇంటిలో ఎమ్మెల్యే లేని సమయంలోనే దాడి చేయడం, ఇంటి ముందు పటాకులు కాల్చడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం కాంగ్రెస్ అల్లరి మూకలకే చెందింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడులు చేసినట్లు వీడియోల్లో స్పష్టంగా ఉంది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నా జిల్లా పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే స్పందించని పోలీసులు ఇక సామాన్యుడికి ఏం న్యాయం చేస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వ పాలన నడుస్తుందా.? లేక రౌడీలా పాలన నడుస్తుందా..? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలపై ఏదో రకంగా దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తున్నారు.