చిన్నకోడూరు, ఆగస్టు 19: కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని, రైతులను సీఎం రేవంత్ నట్టేట ముంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నా, రాస్తారోకోలో సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణు లు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం భారీగా పోలీస్ బలగాలను దించింది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నాతో రాజీవ్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం అయితే, కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీరే మిగిలిందని అన్నారు.
ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదని విమర్శించారు. సరిపడా ఎరువులు అందించకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు యూరియా తేవడంలో విఫలమైనట్లు మండిపడ్డారు.
దౌల్తాబాద్‌లో రైతుల ధర్నా
యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం చౌరస్తా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. మనిషికి రెండు బస్తాల యూరియాను అందించి చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు రెండు బస్తాల యూరియా కోసం షాప్ ల వద్ద క్యూకట్టి పనులు వదులుకోవాల్సి వస్తున్నదని రైతులు వాపోయారు.
రైతుల ధర్నా విషయం తెలిసి మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ అక్కడికి వెళ్లి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువులు ఇప్పిస్తామని చెప్ప రైతులను సముదాయించారు.
– రాయపోల్, ఆగస్టు 19