మెదక్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులను అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు గురువారం ఆమె మద్దతు తెలిపారు.అనంతరం గుల్షన్‌క్లబ్‌లో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీని నెరవేర్చాలన్నారు. కార్మికుల వేతన సవరణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘలకు అనుమతి ఇచ్చి గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.
కార్మికుల పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ఉదయం నుంచి డిపో ఎదుట సమ్మె చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పాపన్నపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి పీఎస్‌లకు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు మెదక్ పోలీసులు అమలు చేస్తున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు డిపో ఎదుట సమ్మె చేస్తే పోలీసులు టెంట్ తొలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీ అధికారులు కాంగ్రెస్ నాయకులను డ్రైవర్లుగా నియమించి బస్సులు నడిపిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి కార్మికులు తగిన బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. మెదక్ ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గుల్షన్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి పాపన్నపేట పీఎస్‌కు తరలించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకొని సమ్మె చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ బస్సులు నడిపించేందుకు ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది జీవన్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు జూబేర్, దీపక్‌కుమార్, సోహెల్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, ఆంజనేయులు, కృష్ణగౌడ్, లింగారెడ్డి, సురేందర్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు ఎంఆర్‌కేరావు, కార్మికులు పాల్గొన్నారు.