మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఆగస్టు 19: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని, యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూరియా కొరతపై మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో రహదారిపై రైతులతో బీఆర్ఎస్ నాయకులు గంటపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వద్దురా… నాయనా కాంగ్రెస్ పాలన, సీఎం రేవంత్ రెడ్డి డౌన్‌డౌన్ అంటూ ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు.
ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. ధర్నాకు రైతులు రాకుండా పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. దుబ్బకా ఎమ్మెల్యేను, రైతులను, బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనను పోలీసులు బలవంతంగా విరమింప చేశారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన పాపానికి రైతులకు యూరియా తిప్పలు వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
లారీలో 400 యూరియా బస్తాలు వస్తే 2వేలు మంది రైతులు క్యూ కడుతున్నారని, గంటల పాటు వేచియున్నా రైతులకు యూరియా మాత్రం దొరకడం లేదన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడు యూరియా కష్టాలు రైతులకు ఎదురకాలేవని, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగాని తనంతోనే ఇప్పుడు యూరియా కొరత ఏర్పడిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయశాఖ మంత్రి ఖమ్మంలో, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిలాబాద్‌లో ఉంటున్నారని, వారికి రైతుల గోస ఎలా వినిపిస్తుందని…? ఏ విధంగా కనిపిస్తాయా…? అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు తన్నీరు హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారని కొత్త ప్రభాకర్‌రెడ్డి గుర్తుచేశారు.
ప్రాజెక్టులపై మంత్రి సమీక్షా ఎక్కడా..
సిద్దిపేట జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల కింద వందల కిలోమీటర్ల వరకు చిన్నాపెద్ద కాలువలు ఉన్నప్పటికీ వాటి పరిస్థితి ఏమిటి? సాగు చేస్తున్నారా?.. లేదా… అంటూ నేటి వరకు నీటి పారుదల శాఖ మంత్రి సమీక్షా నిర్వహించిన దాఖలాలు లేవు. రైతులపై మంత్రికి ఎంత ప్రేమ ఉందో అవగతం అవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు లేవని, ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని, రైతులను పట్టించుకోక పోతే ఎక్కడికక్కడే మంత్రులను అండుకుంటూ వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రైతులు యూరియా కోసం వానలో తడుస్తూ, ఎండల్లో ఎండుతూ ధర్నాలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రెయిన్ డ్యాన్స్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ఒక్క పిల్లర్ కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంగిపోయి కూలిపోయిందని దుష్ర్పచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ వద్ద పిల్లర్ మాత్రమే కాదని ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పంపులు, బ్యారేజ్‌లు, పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు ఉన్నాయని సీఎం, మంత్రులు తెలుసుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి రాష్ర్టా న్ని రక్షించడానికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో ఏ విషయంలోనూ రైతులు రోడ్డెక్కిన దాఖలాలు లేవన్నారు. సీఎం రేవంత్ పుణ్యమా అని నేడు యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు సోలిపేట సతీశ్ రెడ్డి, జీడిపల్లి రవి, శ్రీనివాస్ గౌడ్, కమలాకర్ రెడ్డి, లింగం, శ్రీనివాస్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.