సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కొంత కాలంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి మధ్య గ్రూపు విభేదాలు కొనసాగుతున్నప్పటికీ, వాటిని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. తీరా పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుదారులు వేర్వేరుగా నామినేషన్లు వేయగా, ఒక్కో సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ పరిణామం స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేసిందనే చర్చలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఒక అభ్యర్థిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయాల్సి ఉన్నప్పటికీ, ఇరువురు నేతలు సైతం అందుకు పెద్దగా ప్రయత్నాలేవి చేయలేదని తెలుస్తున్నది.
నారాయణఖేడ్, డిసెంబర్12 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 196 పంచాయతీలకు 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 172 పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే మొత్తం స్థానాల్లో సుమారు మూడింట ఒక వంతు స్థానాల్లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులు బరిలో ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ గ్రూపుల గొడవ సదుమణిగింది అనుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో తిరిగి వర్గాలు బహిర్గతం అవుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్యకర్తలు తామంటే తాము పోటీ చేస్తామని ముందుకు రావడంతో వారిని సముదాయించి ఒకే అభ్యర్థిని బరిలో నిలిపే విషయమై ఇరువురు నేతలు పెద్దగా ప్రయత్నాలేవి చేయడం లేదు.
దీంతో వెనుక ఎవరికి వారు తమ బలగాన్ని కాపాడుకునే ఎత్తుగడను అనుసరిస్తున్నారనే విషయం తేలిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వర్గాలను పక్కన పెట్టి తమ గెలుపు కోసం ఒకరినొకరు సహకరించుకున్న నేతలు, స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మాత్రం గ్రూపులుగా విడదీసి తమ అవకాశాలపై నీళ్లు చల్లుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లోలోపల ఆశావహులను ప్రోత్సహించడం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదనలు బలపడుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడి అభ్యర్థి ఎంపిక సందర్భంగా పొడసూపిన వర్గ విభేదాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాహాటంగానే బయటపడ్డాయని చెప్పొచ్చు. నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో పంచాయతీ ఎన్నికలు రాజేసిన గ్రూపుల నిప్పు ఎటు దారితీస్తుందో వేచిచూడాలి.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేటలో గురువారం తొలి విడుతగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. పెద్దశంకరంపేట సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారుని గెలిపించి ప్రజలు అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థితో పాటు సర్పంచ్ టికెట్ ఆశించి భంగపడిన మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు సైతం బరిలో నిలిచారు. ముగ్గురు కాంగ్రెస్ మద్దతుదారులు పోటీలో ఉండగా, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను తిరస్కరించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం విశేషం.