హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 21: ప్రజలపై పన్నుల భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ సర్కారు పలు రకాల చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలపై పన్నులు వేసేందుకు ప్రభుత్వం పాత చట్టాల బూజు దులుపుమని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయా మున్సిపల్ శాఖ అధికారులు ప్రజల నుంచి ఎలా పన్నులు రాబట్టాలనే దానిపై దృష్టిసారించడమే కాకుండా ఆయా పన్నులు చెల్లించాలంటూ నోటీసులు సైతం జారీచేస్తున్నారు.
ప్రజల ఇండ్లు, దుకాణాలు, ట్రేడ్ లైసెన్సులు, ఇంటి నిర్మాణాలు, నల్లా పన్నుల వసూళ్లు చేపడుతున్న మున్సిపల్ శాఖ అధికారులు, తాజాగా ఆదాయం కోసం ప్రజలపై మరింత పన్నుల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ల్యాండ్ రెగ్యులరైజ్ పేరిట ఆదాయాన్ని సమకూర్చాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేయగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తాజాగా వీఎల్టీ పేరిట పన్నులు వేసేందుకు సిద్ధ్దమైంది.
హుస్నాబాద్ పట్టణంలో ప్లాట్లుగా మారిన ఖాళీ స్థలాలను గుర్తించడంతో పాటు ఇందుకు సంబంధించిన యజమానులకు వీఎల్టీ పేరిట(వెవేట్ ల్యాండ్ ట్యాక్స్) నోటీసులు సైతం మున్సిపల్ జారీచేస్తున్నది. పట్టణంలోని ఇరవై వార్డుల్లో 471 ఖాళీస్థలాలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా గుర్తించారు. ఈ ఖాళీ స్థలాల యజమానులకు సైతం వీఎల్టీ నంబర్లు తీసుకోవాలంటూ వార్డు అధికారులు సదరు యజమానులకు నోటీసులు జారీచేస్తున్నారు.
ఖాళీ స్థలాలకు ఇంటినంబర్లు ఇస్తామంటూ వివరిస్తూ నోటీసులు అందజేస్తున్నారు. ఆయా ఏరియాలో మార్కెట్ వాల్యు ప్రకారం ఇంటి స్థలాలకు ఏ విధంగా పన్ను వేస్తున్నారో, అలానే ఈ వీఎల్టీ పన్ను సైతం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీఎల్టీ పన్ను చెల్లించని పక్షంలో ఆ స్థలం యజమానులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూమిపత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని తక్షణమే ఇంటినంబర్ సైతం కేటాయిస్తామని అధికారులు వివరిస్తూ ప్రజలనుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసే పనిలో పడ్డారు.
పట్టణంలో ఏఏ వాడల్లో ఎన్ని ఖాళీస్థలాలు ఉన్నాయనే విషయాన్ని ప్రాథమికంగా గుర్తించాం. ఇప్పటికే పలువురికి పన్ను చెల్లించి నంబర్ పొందాలని నోటీసులు జారీచే శాం. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు వారి స్థలాలపై హక్కులు సైతం ఉండేందుకు వీఎల్టీ ఉపయోగపడుతుంది.
– మల్లికార్జున్‌గౌడ్,హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్