రామాయంపేట, మే 30: ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలిగించాలని నిర్ణయించడం సరైంది కాదు. మేధావుల సమక్షంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన చిహ్నం ఒక కులానికి, మతానికి సంబంధం లేకుండా ఉన్నది.
అందులో మనందరికీ తెలిసి ఎలాంటి లోపాలు లేవు. మార్చాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సోషల్ మీడియాలో వైరలై, ప్రజలందరి మొప్పు పొందిన మన రాజముద్రను కేసీఆర్ ప్రభుత్వం అధికార ముద్రగా ప్రకటించింది. దీనిని ఇలాగే కొనసాగిస్తే ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవించినట్లు అవుతుంది.
– శివొల్ల కృష్ణ, కళాకారుడు, డి.ధర్మారం, రామాయంపేట
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులను స్మరించుకోవడానికి అప్పటి తెలంగాణ ఉద్యమ సారథి, బీఆర్ఎస్ అధినేత ఎంతో మంది మేధావుల పర్యవేక్షణలో రాష్ట్ర చిహ్నానికి రూపకల్పన చేసిన విషయం కాంగ్రెస్ సర్కారు గమనించాలి.
కాంగ్రెస్ నాయకులు వారి ఉనికి కోసం చిహ్నంలో మార్పులు చేసి కాకతీయ కళాతోరణాన్ని, హిందూముస్లింల ఐక్యతకు ప్రతీకైన చార్మినార్‌ను తొలిగించాలని చూస్తే రాష్ట్ర ప్రజలు సహించరు. ముందు కాకతీయ కళాతోరణం, చార్మినార్ ప్రత్యేకతలను, విశేషాలను తెలుసుకుని రాష్ట్ర సర్కారు ముందుకు పోవాలి. లేదంటే ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం.
– కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు, గుమ్మడిదల మండలం
కోహీర్, మే 30: కాంగ్రెస్ పాలనలో మార్పు అంటే ఇదేనా…? తెలంగాణ ప్రజలకు ఏం చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు మరిచిపోయి, ప్రజలకు అవసరం లేని కొత్త పనులు చేస్తున్నారు. వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలిగిస్తామని చెప్పడం ప్రజల దృష్టిని మరల్చేందుకే. చిహ్నాలు తొలిగించడం, టీఎస్‌కు బదులుగా టీజీ పెట్టడంతో ప్రజా సంక్షేమం జరుగుతుందా, ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతాయా? కాంగ్రెస్ నాయకులే చెప్పాలి. ప్రజలు కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించారో అనే సంగతి ఆ పార్టీ నాయకులు మర్చిపోయారు. త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారు.
– సతీశ్‌రెడ్డి, సంఘ సేవకుడు, మాచిరెడ్డిపల్లి, కోహీర్ మండలం
కొమురవెల్లి, మే 30: ప్రజాగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. పదేండ్లుగా కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను కొనసాగించలేని రేవంత్ సర్కారు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలైన తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలిగించడం నీచమైన చర్య. తెలంగాణ ప్రజలు మీకిచ్చిన అవకాశాన్ని సంక్షేమం, అభివృద్ధిలో చూపించాలి.
కానీ రాష్ట్ర పరిపాలనను గాలికొదిలి ప్రజల దృష్టిని మర్చాలని దృష్ట పన్నాగం పండడం దురదృష్టకరం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై కక్షకట్టి టీఎస్‌ను టీజీగా మార్చడమే గాక తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులను మార్చేంద్దుకు సిద్ధ్దం కావడం రేవంత్ వికృత చేష్టలకు నిదర్శనం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానాల సాక్షిగా తెలంగాణను సాకారం చేసుకున్నాం. ఏనాడూ తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనని, తెలంగాణ చరిత్ర తెలియని రేవంత్ రాజముద్రను మార్చడం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజల తిరగబడే రోజు తప్పక వస్తుంది.
– పబ్బోజు విజేందర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు