మెదక్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో చెరువులకు మహర్దశ పట్టగా, కాంగ్రెస్ పాలనలో కనీసం మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసి 118 చెరువు కట్టలు తెగిపోయాయి. పలు చెరువుల అలుగులు, తూములు దెబ్బతిన్నాయి.వీటి మరమ్మతులను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లాలో 2238 చెరువులు, కుంటలు ఉన్నాయి. మెదక్, తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, రామాయంపేటలో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి.
మెదక్ నీటిపారుల శాఖ ఈఈ కార్యాలయం పరిధిలో మెదక్ మండలంలో 93 చెరువులు, కుంటలు, హవేళీఘనపూర్‌లో 106, పాపన్నపేటలో 130, నిజాంపేటలో 72, రామాయంపేటలో 107, కౌడిపల్లిలో 166, చిలిపిచెడ్‌లో 75, కొల్చారంలో 116, వెల్దుర్తిలో 192, మాసాయిపేటలో 81, చేగుంటలో 157, చిన్నశంకరంపేటలో 185, నార్సింగ్‌లో 72, నర్సాపూర్‌లో 193, శివంపేటలో 205, తూప్రాన్‌లో 175, మనోహరాబాద్‌లో 133 చెరువులు, కుంటలు ఉన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట(ఏ) మండలాలను సంగారెడ్డి జిల్లాలోని దౌల్తాబాద్ నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వీటి ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మెదక్ ఈఈ పరిధిలో 500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండి సాగునీరు అందిస్తున్న చెరువులకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ మండలంలో ఉన్న రాయన్‌పల్లి ప్రాజెక్టుకు 1200 ఎకరాల ఆయకట్టు ఉంది. కొంటూర్ పెద్దచెరువుకు 1450 ఎకరాలు, రామాయంపేట మండలంలోని నార్లాపూర్లోని హైదర్చెరువుకు 812 ఎకరాలు, నర్సాపూర్‌లోని రాయరావు చెరువుకు 510 ఎకరాల ఆయకట్టు ఉంది. వెల్దుర్తిలో ఉన్న దేవతల చెరువుకు 700 ఎకరాలు, హకీంపేటలో హల్దీవాగు ప్రాజెక్టుకు 2900 ఎకరాలు, చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట పెద్దచెరువుకు 838 ఎకరాల ఆయకట్టు ఉంది.
టేక్మాల్ మండలంలోని కుసంగిలోని మాసాన్‌పల్లి చెరువుకు 530 ఎకరాలు, టేక్మాల్‌లో ఉన్న పెద్దచెరువుకు 522 ఎకరాలు, తూప్రాన్‌లో ఉన్న పెద్దచెరువుకు 761 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో 500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా, చెరువుల ద్వారా 10223.49 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మెదక్ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులకు రూ. 34 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వేసవిలో పనులు చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా నీటివనరులపై ఆధారపడి వరి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేస్తారు.
మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కార్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచయ్మ ప్రాజెక్టు నుంచి కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట బ్రాంచ్ కెనాల్ కాలువను 8 కిలోమీటర్లు సీసీ లైనింగ్ రాంపూర్ వరకు నిర్మాణం చేపట్టింది. కెనాల్ 23 కిలోమీటర్లు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. మహ్మద్‌షాపూర్, రుక్మాపూర్, వల్లూర్, చిన్నశంకరంపేట శివారులో అటవీ ప్రాంతంలో భూసేకరణ పెండింగ్‌లో ఉండడంతో పనులు నిలిచిపోయాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు పట్టించుకోక పోవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. కామారంలో కాలువ నిర్మాణానికి రైతుల నుంచి ప్రభుత్వం 40 ఎకరాలు భూసేకరణ చేసింది. కాలువల నిర్మాణం చేయకపోతే మా భూములు మాకు ఇవ్వాలని, బ్యాంక్ వడ్డీతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాలువల నిర్మా ణం చేస్తామంటే వ్యవసాయ భూ ములు ఇచ్చాం. నీటిపారుదల శాఖ అధికారులు కాలువ పనులు చేయడం లేదు. పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం డబ్బులు తిరిగి బ్యాంకు వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. కామారంలో రైతులకు చెందిన 40 ఎకరాల భూములు కాలు వ నిర్మాణం కోసం ఇచ్చారు. వ్యవసాయ పంటలకు సాగునీరు అందిస్తారనే ఉద్దేశంతో పంటలు పండే భూము లు కాలువ నిర్మాణం కోసం ఇచ్చాం. ప్రభుత్వం తిరిగి మా భూములు మాకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
– అంజిరెడ్డి, రైతు, కామారం చిన్నశంకరంపేట మండలం (మెదక్ జిల్లా)
చెరువులకు మరమ్మతులు చేసి వ్యవసాయరంగానికి సాగునీరు అందించేందుకు సర్కార్ చర్యలు తీసుకోవాలి. కొన్నేండ్లుగా చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడం లేదు. వర్షపు నీరు నిలువ ఉండేందుకు పూడికతీత పనులు చేపట్టాలి. చెరువులో మట్టి పేరుకుపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం లేదు. వర్షాకాలం వరకు చెరువులకు మరమ్మతులు చేసేందుకు సర్కార్ నిధులు మంజూరు చేయాలి.
– గుగులోత్ గణేశ్, రైతు, మాల్కాపూర్ తండా (మెదక్ జిల్లా)
చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేస్తే వర్షాకాలంలో ఎక్కువ నీరు నిలువ ఉండే అవకాశం ఉంది. చెరువులో మట్టిపేరుకుపోయింది. కాలువలకు వెంటనే మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు లీకేజీలు అవుతున్నాయి. చివరి ఆయకట్టకు నీరు అందే పరిస్థితి లేదు. భారీ వర్షాలకు కొన్ని చెరువుల అలుగులు, తూములు, కట్టలు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. చెరువుపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. చెరువులో సాగునీరు లేకపోతే రైతులకు కష్టాలు వస్తాయి.
– దుర్గాగౌడ్, రైతు, తిమ్మక్కపల్లి (మెదక్ జిల్లా)
మెదక్ జిల్లాలోని చెరువుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. తూములు, అలుగులు, కట్టకు మరమ్మతులు, కాలువలు ఆధునీకరణకు రూ. 34 కోట్ల్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే టెండర్లు వేసి పనులు చేస్తాం. గతేడాది భారీ వర్షాలకు కొన్ని చెరువులు దెబ్బతిన్నాయి. చిన్నశంకరంపేట కాలువ పనులకు భూసేకరణ పెండింగ్ పూర్తికాలేదు. దీంతో పనులు ముందుకు సాగడం లేదు.
– శ్రీనివాస్‌రావు, ఇరిగేషన్ ఈఈ మెదక్